ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : మిర్చి ధరలు తగ్గుదల తాత్కాలికమేనని, వచ్చేనెల నుంచి మళ్లీ ధరలు పెరుగుతాయని మిర్చి యార్డు చైర్మన్‌గా మద్దిరెడ్డి సుధాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పలు కారణాలతో మిర్చి ధరలు స్వల్పంగా తగ్గాయన్నారు. యార్డులో రైతులకు మరిన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామన్న ఆయన ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు తెలిపారు.
మిర్చి ధరల తగ్గుదలకు కారణం?
బంగ్లాదేశ్‌కు మిర్చి ఎగుమతులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. రంజాన్ పండగ తరువాత మళ్లీ ఎగుమతి ఆర్డర్లు వస్తాయి. దీంతో బంగ్లాదేశ్ మీదుగా ఇతర దేశాలకు మిర్చి ఎగుమతి అవుతుంది. వచ్చే నెల నుంచి మిర్చి ధరలు మళ్లీ పెరుగుతాయని అనుకుంటున్నాం. ప్రస్తుతం సగటు ధర రూ.18 వేల నుంచి రూ.20 వేలు తగ్గడం లేదు. అంతే గాక అకాల వర్షాల వల్ల మిర్చి నాణ్యత కొంత తగ్గింది. ధరల తగ్గుదలకు ఇది కూడా ఒక కారణం. మిర్చిని అరబెట్టు కుని వస్తే తేమశా తం లేకుండా ఉంటే ధర వస్తుంది. తామర తెగుల నివారణకు కొంతమంది ఇబ్బడిముబ్బడిగా పురుగు మందులు వాడటం వల్ల కూడా నాణ్యత తగ్గు తోంది. ధర ఎంత తగ్గినా రంజాన్ తర్వాత రూ.20 వేలు దాటుతుందని భావిస్తున్నాం.
యార్డులో అభివృద్ధి పనులు?
యార్డులో రూ.7 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పనులు చేపడతాం. ప్రధానంగా యార్డు పరిధిలో రోడ్ల నిర్మాణం, దెబ్బతిన్న భవనాలను తొలగించి నూతన భవనాలను నిర్మించడం, తాగునీటి పైపులైన్లు, టాయిలెట్స్ మరమ్మతులు చేపడుతున్నాం. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాలిగిరి సూచనలతో పలు ప్రతిపాదనలు చేశాం.
రైతులకు అందిస్తున్న సౌకర్యాలు?
యార్డులో ప్రతిరోజు వెయ్యి మందికిపైగా రైతులకు ఉచితంగా భోజనం పెడుతున్నాం. వారి వసతికి నిర్మించిన భవనంలో తగిన సౌకర్యాలు కల్పిస్తున్నాం. కూలర్స్, ఎసి సదుపాయాలు మెరుగుపరుస్తున్నాం. వర్షం వస్తే మిర్చి తడిసిపోకుండా ముందస్తుగా టార్ఫాలిన్‌లు అందుబాటులో ఉంచుతున్నాం. వేకువజామున సరుకు భారీగా వచ్చే సమయంలో ఆకస్మికంగా వర్షం వచ్చిన మిర్చి తడవకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు చెబుతున్నాం. వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలు ఆధారంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. యార్డులో వర్షం వచ్చినా సరుకు తడవకుండా రైతులకు తగిన సదుపాయాలు కల్పిస్తున్నాం. ఒకవేళ తడిస్తే ఆరబెట్టుకోవడానికి ప్రత్యేకంగా ప్లాట్‌ఫారాలు కూడా ఏర్పాటు చేశాం.










