ప్రజాశక్తి - మండవల్లి
మినుము పంటకు ఆశించే తెగుళ్లను ముందుగానే పరిశీలించి అరికట్టేలా చర్యలు తీసుకుంటే పైరులో అధిక లాభాలు పొందొచ్చని మండల వ్యవసాయాధికారి ఎస్‌కె.జరీనా తెలిపారు. మండలంలోని రుద్రవరంలో మినుము పంటను ఆమె రైతులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మినుము ఫైరులో ఎండు తెగులును గమనించామని చెప్పారు. ఈ తెగులు మినుము పంటకు ఆశిస్తే ఆకులు పసుపు రంగులోకి మారి తొడిమలు ఆకులు కాండం, వేరులు క్రమేపి ఎండిపోతాయని తెలిపారు. తల్లి వేరు నిలువుగా చీల్చి పరిశీలిస్తే లోపలి భాగం ముదురు గోధుమ రంగులో ఉంటుందన్నారు. భూమిలో ఉండే ఈ శిలీంద్రం వేరు ద్వారా మొక్కలకు ప్రవేశించడం వల్ల మొక్కలు క్రమేపి ఎండిపోతాయన్నారు. ఈ తెగులు నుంచి పంటను రక్షించుకోవడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలన్నారు. తెగుళ్లను తట్టుకునే ఎల్‌బిజి 402 645 648 752 రకాలను సాగు చేసుకోవాలన్నారు. వేసవిలో దుక్కులు వేయడం ద్వారా భూమిలోని సిలింద్రాలను నాశనం చేయవచ్చని పచ్చిరొట్ట సేంద్రీయ ఎరువులు భూమిలో వేసి కలియ దున్నుకోవాలని చెప్పారు. థైరం లేదా కాప్టాన్ లేదా కార్బెండిజం మూడు గ్రాములు ఒక కిలో విత్తనానికి ట్రైకోడర్మావిరిడి పది గ్రాములు ఒక కిలో విత్తనానికి కలిపి శుద్ధిచేసి విత్తుకోవాలన్నారు. మినుము పంటలో భూమి ద్వారా వ్యాప్తి చెంది తెగుళ్లను నివారించుకునేందుకు అభివృద్ధి పరచిన ట్రైకోడర్మావిరిడి అనగా చివికిన పశువుల ఎరువు 90 కిలోలు, వేప పిండి పది కిలోలు, ట్రైకోడర్మావిరిడి రెండు కిలోలు కలిపి అభివృద్ధి చేసిన భూమిలో చల్లుకోవాలని సూచించారు. మినుము పంటలో ఆశించిన తెగుళ్లకు మల్టీ కే ఒక కేజిని ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవాలని తెలిపారు.










