ప్రజాశక్తి-అద్దంకి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన ముందస్తు మినీ మేనిఫెస్టోను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టిడిపి నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. అద్దంకి పట్టణంలోని పోతురాజుగండిలోగల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం వెంపరాల, ఉప్పలపాడు, మైలవరం, చిన్నకొత్తల్లి, గోవాడ, చక్రాయ పాలెం, గోపాలపురం, సింగరకొండపాలెం గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. అనంతరం గ్రామా ల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు, ఉప్పలపాడు, వెంపరాల, మైలవరం, గోవాడ గ్రామాల రోడ్లు అధ్వానంగా ఉన్నాయని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు అనేక మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గత రెండున్నరేళ్లుగా ప్రజలపై అనేక భారాలు మోపుతూ ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. గత నాలుగేళ్ల కాలంలో రోడ్లపై ఎక్కడా తట్టెడు మట్టివేసిన పాపానపోలేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల కాలంలో విద్యుత్ చార్జీలు 8సార్లు పెంచి రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు. ఉప్పలపాడు గ్రామంలో 15 కోట్ల 56 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించదలచిన ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి 4సంవత్సరాలు పూర్తెనా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని విమర్శిం చారు. పథకం పూర్తయినట్లయితే ఉప్పలపాడు ఎత్తిపోతల పథకం ఆయకట్టు కింద మైలవరం, ఉప్పలపాడు గ్రామాల్లోని రైతులకు చెందిన సుమారు 2,500 ఎకరాలకు సాగునీరు అంది సస్యశ్యామలంగా ఉండేదని అన్నారు. టిడిపి వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చిందని, ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి వ్యథలు శాశ్వతంగా తొలగిపోవాలనే తలంపుతో నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఉప్పలపాడు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రైతులందరూ పాడి పంటలతో, సుఖ సంతోషాలతో, ఆనందంగా ఉండాలన్నదే టిడిపి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉప్పలపాడు ఎత్తిపోతల పథకం పూర్తిచేసి రైతులకు అంకితం చేస్తామన్నారు. రోడ్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన పోవాలని రాష్ట్రానికి మంచి రోజులు రావాలని, చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నా రన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, కార్యకర్తలు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌ఛార్జులు తదితరులు పాల్గొన్నారు.










