Jul 25,2023 22:33

మగ్గం నేస్తున్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం

ప్రజాశక్తి - ఆమదాలవలస : మినీ ఖాదీ క్లస్టర్‌ ఏర్పాటు ద్వారా నేతన్నకు చేయూత అందిస్తామని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని శ్రీనివాసాచార్యులపేట క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంలో భాగంగా శ్రీ సీతారామ స్వామి చేనేత సహకార సంఘం కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌కు తొలి విడతలో మంజూరైన రూ.73 లక్షల విలువ గల చేనేత మగ్గాలు, ఇతర పరికరాలను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్లస్టర్‌ యూనిట్‌కు సుదీర్ఘమైన చరిత్ర ఉందన్నారు. మినీ ఖాదీ క్లస్టర్‌ ఏర్పాటు ద్వారా నేతన్నకు ఆధునిక పద్ధతుల్లో వస్త్రాల నేత అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఇక్కడ నేసిన ఖాదీ వస్త్రాలు నాణ్యతతో కూడి మన్నిక కలిగి వినియోగదారుల అభిమానాన్ని చూరగొందన్నారు. కుల వృత్తులు అంతరించకుండా ఉండేందుకు ప్రభుత్వం వారిని ప్రోత్సహించేలా పలు చర్యలకు ఉపక్రమించిందని చెప్పారు. దేశంలోనే పొందూరు ఖాదీకి ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. త్వరలోనే పొందూరు ఖాదీకి పేటెంట్‌ హక్కులు రామన్నాయని తెలిపారు. నియోజకవర్గంలో మినీ ఖాదీ క్లస్టర్లను అవసరమయ్యే చోట ఏర్పాటు చేసేందుకు చేనేత జౌళి శాఖ ప్రతిపాదనలు చేయగా, అవి మంజూరయ్యాయన్నారు. ఒక్కో మినీ క్లస్టర్‌కు రూ.రెండు కోట్ల పెట్టుబడి అవసరం కాగా, కేంద్ర ప్రభుత్వం 90 శాతం సహాయం అందిస్తుందని, లబ్ధిదారులు 10 శాతం మాత్రమే వాటాగా పెట్టాల్సి ఉంటుందని తెలిపారు. మినీ క్లస్టర్‌ ప్రాజెక్టు వల్ల చేనేత కార్మికులకు చేనేత, డయింగ్‌, డిజైనింగ్‌, ఐటి, మేనేజీరియల్‌ రంగాల్లో పూర్తిస్థాయిలో శిక్షణ లభించనుందని తెలిపారు. శిక్షణా కాలంలో రోజుకు రూ.300 స్టైఫండ్‌ అందించనున్నట్లు చెప్పారు. 'సమర్థ' పథకం కింద నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనివల్ల మగ్గాలు, ఆధునిక పరికరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో డిఇ ధర్మారావు, ఎంపిపి ప్రతినిధి తమ్మినేని శ్రీరామ్మూర్తి, డిసిసిబి డైరెక్టర్‌ బొడ్డేపల్లి నారాయణరావు, సచివాలయం కోఆర్డినేటర్‌ బొడ్డేపల్లి నిరంజన్‌బాబు, దన్నాన సత్యనారాయణ, గురుగుబెల్లి ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.