ప్రజాశక్తి - ఏలూరు
అకాల వర్షాల నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని, రవాణాకు లారీలు ఏర్పాటు చేయాలని, నాణ్యమైన గోనె సంచులు అందించాలని, తూకల్లో తేడాలు, నూక శాతం పేరుతో డబ్బులు వసూలు ఆపాలని ఎపి రైతు సంఘం జిల్లా కమిటీ కోరింది. ఈ మేరకు ఏలూరు కలెక్టరేట్‌లోని స్పందన కార్యక్రమంలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌కు, జెసి లావణ్యవేణికి ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రబీ ధాన్యం కొనుగోలులో అనేక సమస్యలతో రైతులు, కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వాతావరణ పరిస్థితులు మారి ఆకాశం మబ్బులుగా ఉండటం, జిల్లాలో అక్కడక్కడ చినుకులు పడడంతో రైతాంగం ఆందోళన చెందుతోందన్నారు. ధాన్యం రవాణాకు తగినన్ని వాహనాలు అందుబాటులో లేక కల్లాలోనే ధాన్యం ఉండిపో యిందన్నారు. మిల్లులకు ధాన్యం చేరిన తర్వాత నూక శాతం పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని, ఆర్‌బికెకు నిర్దేశించిన వే బ్రిడ్జి కాటాకు రైస్ మిల్లు వద్ద ఉన్న వే బ్రిడ్జి కాటాకు తూకంలో తేడాలు చూపించి తూకం తక్కువ వచ్చిందని రైతుల నుండి ఎన్ని కేజీలు తేడా వస్తే అంత ధాన్యానికి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపి కౌలు రైతుల సంఘం జిల్లా నాయకులు ఉల్లంకి నాంచారయ్య, రైతులు పాల్గొన్నారు.










