ఖరీఫ్ ధాన్యం అమ్మకాల్లో తీవ్రంగా నష్టపోయిన రైతులు
ముప్పుతిప్పలు పెట్టిన మిల్లర్లు.. ఎదరు డబ్బు చెల్లించిన అన్నదాత
తేమ, తూకం తదితర సమస్యలతో రైతన్న ఉక్కిరిబిక్కిరి
రబీ పంట పరిస్థితిపై ఆందోళనలో అన్నదాత
'కొత్తూరుకు చెందిన పల్లపోతుల రెడ్డియ్య ఖరీఫ్‌లో ఏడెకరాల్లో వరి సాగు చేశాడు. 280 బస్తాల వరకూ రైతుభరోసా కేంద్రాల ద్వారా విక్రయించాడు. జట్టు, కిరాయిల నుంచి ఎన్నో ఇబ్బందులు పడి కేటాయించిన మిల్లుకు ధాన్యం తోలాడు. రైతుభరోసా కేంద్రం సిబ్బంది వద్ద తేమశాతం 16.7 రాగా, మిల్లు వద్ద 17.2 వచ్చిందని చెప్పారు. పాయింట్‌కు రూ. పది చొప్పున సొమ్ము రైతుల వద్ద నుంచి వసూలు చేశారు. తూకంలో తేడా వచ్చిందని కిలోకు రూ.20 వసూలు చేశారు. మొత్తంగా రూ.13,600 చెల్లిస్తే తప్ప ధాన్యం దింపుకోని పరిస్థితి కొనసాగింది.'
'కన్నెగంటి పూర్ణచంద్రరావుది కొత్తూరు గ్రామం. ఖరీఫ్‌లో ఏడెకరాలు సాగు చేశాడు. మొత్తం 205 బస్తాల ధాన్యం వరకూ విక్రయించాడు. మిల్లుకు వెళ్లిన తర్వాత బియ్యం ముక్క అవుతుందని బస్తాకు రూ.30 చొప్పున 180 బస్తాలకు డబ్బు కట్టించుకున్నారు. డబ్బు కట్టకపోతే ధాన్యం తీసుకునే పరిస్థితి లేకపోవడంతో అప్పు చేసి సొమ్ము చెల్లించారు.'
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
పైన పేర్కొన్న పల్లపోతుల రెడ్డియ్య, పూర్ణచంద్రరావులే కాదు. గడిచిన ఖరీఫ్‌లో ధాన్యం విక్రయించిన మూడొంతుల మంది రైతులు ఇదేవిధంగా ముందుగా మిల్లర్లకు డబ్బు చెల్లించి ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి రెండు జిల్లాల్లోనూ కొనసాగింది. నూతన ధాన్యం కొనుగోలు విధానంలో రైతులు పడ్డ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. రెండు జిల్లాలవ్యాప్తంగా ఖరీఫ్‌లో దాదాపు 4.50 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. ఏలూరు జిల్లాలో 3.79 లక్షల టన్నుల ధాన్యం, పశ్చిమగోదావరి జిల్లాలో 3.76 లక్షల టన్నుల ధాన్యం రైతులు విక్రయించారు. ఖరీఫ్ ధాన్యం అమ్ముకునేందుకు రైతులు అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పంట మాసూళ్లు చేసిన తర్వాత రైతుభరోసా కేంద్రం వద్దకు వెళ్లి ఆన్‌లైన్ చేసుకోవడం, గోనె సంచులు సరిగా ఇవ్వకపోవడం, వారం, పది రోజులపాటు లారీలో రాకపోవడం, తేమశాతం, తూకం వంటి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మిల్లర్లు రైతులను ముప్పుతిప్పలు పెట్టారు. రైతుభరోసా కేంద్రం అధికారులు నిబంధలనకు అనుగుణంగా తేమ 17 శాతం ఉందని నిర్థారించేవారు. తీరా మిల్లు వద్దకు వెళ్లాక తేమశాతం 18, 19 ఉందంటూ పాయింట్‌కు రూ.పది చొప్పున రైతుల నుంచి డబ్బు వసూలు చేసేవారు. డబ్బు ఫోన్‌పే చేస్తేనే లారీలో ధాన్యం దింపుకునేవారు. లేకపోతే ఎన్ని రోజులైనా లారీలో ధాన్యం అలానే ఉంచేసేవారు. అధికారులు నిర్ణయించిన వేబ్రిడ్జి వద్ద తూకం సరిగా వచ్చినప్పటికీ మిల్లు వద్ద తూకం తగ్గిందని కిలోకు రూ.20 వసూలు చేశారు. ధాన్యం విక్రయించిన ప్రతి రైతూ డబ్బు ఎదురు చెల్లించాల్సి వచ్చేది. ధాన్యం కిరాయి రూ.రెండు వేలకు మాట్లాడితే మిల్లు వద్ద ధాన్యం తీసుకెళ్లిన లారీ, ట్రాక్టర్ ఒకరోజు అదనంగా ఉంటే మరో రూ.రెండు వేలు కిరాయి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధాన్యం పొలంలో నుంచి గట్టుమీదకు, అక్కడి నుంచి మిల్లుకు ఇలా రెండుసార్లు ఎగుమతి, దిగుమతి పేరుతో అదనంగా ఖర్చు చేయాల్సి పరిస్థితి వచ్చింది. ధాన్యం సొమ్ము 21 రోజులకు చెల్లించాల్సి ఉండగా నెలలు తరబడి చెల్లించని దుస్థితి కొనసాగింది. ఎదురు డబ్బు చెల్లించి ధాన్యం అమ్ముకోవడం ఏమిటని రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. రబీలోనూ ఇదే విధానం కొనసాగితే పరిస్థితి ఏమిటనే ఆందోళన అన్నదాతను వెంటాడుతోంది. నూతన కొనుగోలు విధానంలో సమస్యలను పరిష్కరించి రబీలో ధాన్యం కొనుగోలు చేయకపోతే సాగు చేయడం ఇక మానుకోవాల్సిందేననే చర్చ రైతుల్లో నడుస్తోంది. ధాన్యం కొనుగోలు విధానంలో మిల్లర్ల దోపిడీని అరికట్టకపోతే రబీలోనూ రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడనుంది. ప్రభుత్వం రబీలో ధాన్యం కొనుగోలులో ఎటువంటి చర్యలు చేపడుతుందో వేచిచూడాలి.










