
- అసోం నుంచి కదిలిన నిలిచిపోయిన గూడ్స్ ట్రక్కులు
అసిల్చార్ : మిజోరాంపై ఆర్థిక దిగ్బంధనాన్ని అసోంలోని కాచర్ జిల్లా లైలాపూర్ స్థానికులు తొలగించారు. దీంతో గతకొన్ని రోజులుగా రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో నిలిచిపోయివున్న తొమ్మిది గూడ్స్ ట్రక్కులు శనివారం రాత్రి ముందుకు కదిలాయి. ఇది జాతీయ రహదారి 306 మీదుగా మిజోరాంలోకి ప్రవేశించాయని అధికారులు ఆదివారం తెలిపారు. శనివారం సాయంత్రం నాలుగు గంటల పాటు అసోంకు చెందిన ఇద్దరు మంత్రులు, ఇతర అధికారులు ట్రక్కుల నిలిపివేతపై చర్చించారు. సరిహద్దు వివాదం నేపథ్యంలో గతనెల 26న చోటుచేసుకున్న ఘర్షణలో ఆరుగురు పోలీసులతోసహా ఒక పౌరుడు మరణించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని స్థానికులకు హామీ ఇవ్వడంతో వారు ట్రక్కులను ముందుకు పోనిచ్చారు. స్థానికులతో మాట్లాడి దిగ్బంధనాన్ని ఎత్తివేయించిన అసోం ప్రభుత్వానికి మిజోరాం మంత్రి లాల్రు అత్కిమా కృతజ్ఞతలు తెలిపారు. నిలిచిపోయిన వాహనాల్లో కోవిడ్-19 టెస్టింగ్ కిట్‌లు, ఇతర ఔషధాలు ఉన్నాయని అన్నారు. అసోం పట్టణాభివృద్ధిశాఖ మంత్రి అశోక్ సింఘాల్, పర్యావరణ శాఖ మంత్రి పరిమాల్ శుక్లాబైద్యా, కాచర్ డిప్యూటీ కమిషనర్ కీర్తి జల్లి, ఎస్‌పి రమణదీప్ కౌర్ స్థానికులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగియకముందే కొన్ని వాహనాలు ముందుకు సాగేందుకు ప్రయత్నించడంతో స్థానికులు రాళ్లు రువ్వారని, ఎస్‌పి వారిని శాంతింపజేశారని లైలాపూర్ పోలీసుస్టేషన్ అధికారి ఒకరు చెప్పారు.