Jul 30,2021 09:34

గువహటి : మిజోరాంతో సరిహద్దు వివాదం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి వెళ్లరాదని అసోం ప్రభుత్వం తన ప్రజలను హెచ్చరించింది. ఇటీవల మిజోరాం-అసోం సరిహద్దు వివాదం చెలరేగగా..ఇరు రాష్ట్రాల మధ్య ప్రజలు ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగిన సంగతి విదితమే. ఈ ఘటనలో అసోంకు చెందిన ఆరుగురు పోలీసులు మృతి చెందారు. మరో 45 మంది గాయపడ్డారు. ఈ హింసాకాండకు మీరంటే మీరు కారణమని అసోం, మిజోరాంలు పరస్పర నిందారోపణలు చేసుకుంటున్నాయి. ఈ ఘర్షణలు చెలరేగేందుకు అసోం పోలీసులు కారణమని, ముందు వారే తూటాలను పేల్చినట్లు తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని మిజోరాం పేర్కొంటోంది. కేంద్ర మంత్రి అమిత్‌షాతో బోర్డర్‌ సమస్యపై శాంతియుత చర్చలు జరిగిన రెండు రోజుల తర్వాత వివాదం చెలరేగడానికి కారణాలేంటనీ ముఖ్యమంత్రి జోరంతంగా ప్రశ్నించారు.
కాగా, ఈ ఘటన తర్వాత, మిజో పౌర సంఘాలు, విద్యార్థులు, యువత...అసోం, ఇక్కడ ప్రజలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని, వారి వద్ద ఆటోమేటిక్‌ ఆయుధాలు భారీగా ఉన్నాయని...దీని దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని అసోం ప్రభుత్వం సూచనలో తెలిపింది. ఈ నేపథ్యంలో మిజోరాంకు ప్రయాణం చేయవద్దని, మిజోరాంలో పని చేస్తున్న అసోం ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.