ప్రజాశక్తి-కలెక్టరేట్, విశాఖ : మీటర్లు బిగించిన కుళాయిల ద్వారా నీరు వద్దని, పాత పద్ధతిలోనే ఇవ్వాలని ఐద్వా జగదాంబ జోన్ కమిటీ ఆధ్వర్యాన పందిమెట్ట ప్రాంతంలో సోమవారం నిరసన తెలిపారు. ఈ మేరకు జివిఎంసి ఎఇని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐద్వా జోన్ అధ్యక్షులు కె.మణి మాట్లాడుతూ, కుళాయిలకు మీటర్లు బిగించి మొదటి మూడు నెలలు ఉచితం అని చెప్పి ఆ తర్వాత విపరీతంగా చార్జీలు వేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్నారు. తాగే నీటిపై ఈ రకమైన వ్యాపార ధోరణి ప్రభుత్వాలకు తగదని, వెంటనే ఈ మీటర్ల పద్ధతిని తొలగించి పాత పద్ధతిలోనే కుళాయిలు ద్వారా నీరు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఎఇ స్పందిస్తూ పాత పద్ధతిలోనే కుళాయిల ద్వారా వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా సభ్యులు లక్ష్మి, సరస్వతి, ఆదిలక్ష్మి, సీతారత్నం, పుష్ప, బుజ్జి, మణి తదితరులు పాల్గొన్నారు.










