
ప్రజాశక్తి - విజయనగరం టౌన్ : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న 3,800 మీటర్ రీడర్స్‌కు శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర వ్యాప్తంగా మీటర్ రీడర్స్ శ్రీకాకుళం, అనంతపురం, కడప ప్రాంతాలు నుండి బైక్ యాత్రలు శుక్రవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం నుంచి బయలుదేరిన బైక్ యాత్ర శుక్రవారం సాయంత్రం 4 గంటలకు విజయనగరం విద్యుత్ భవనం చేరుకొని సూపరింటెండెంట్ ఇంజనీర్‌కి వినతి పత్రం ఇచ్చారు. ఈ బైక్ యాత్రకు ఏపి మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రామకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ శివారెడ్డి, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు కుమారస్వామి, విశాఖ జిల్లా అధ్యక్షులు క్రాంతి నాయకత్వం వహించారు. బైక్ యాత్రలో పాల్గొని వచ్చిన నాయకులకు విజయనగరం జిల్లా అధ్యక్షులు ఎస్ శ్రీనివాసరావు, కార్యదర్శులు యం శ్రీనివాసరావు, శ్రీకాంత్, దివాకర్ స్వాగతం పలికారు. ఈ బైక్ యాత్రలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కే సురేష్ పాల్గొని మద్దతు తెలియజేశారు. ఈ బైక్ యాత్రలో వచ్చిన రాష్ట్ర నాయకత్వానికి విజయనగరం జిల్లాలో ఉన్న మీటర్ రీడర్స్ సమస్యలు తెలియజేసారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు మీటర్ రీడర్స్ సమస్యలపై గళం ఎత్తి నినందించారని అధికారంలోకి వచ్చిన తరువాత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నాలుగేళ్లవుతున్నా ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. గత 10 - 20 సంవత్సరాలగా కనీస వేతనాలు కూడా లేకుండా పీస్ రేటు పద్ధతిలో పనిచేస్తూ శ్రమ దోపిడీకి గురవుతున్నారని చెప్పారు. బైక్ యాత్ర జయప్రదం కావాలని కోరుతూ బైక్ యాత్రలో పాల్గొన్న నాయకులు అభినందనలు తెలుపుతూ మీటర్ రీడర్స్ చేస్తున్న అన్ని పోరాటాలకు సిఐటియు విధానం జిల్లా కమిటీ సంపూర్ణ మద్ద తెలియజేస్తుందని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ ఎటువంటి పని భద్రతా లేకుండా పీస్ రేటుతో పనిచేస్తున్న మీటర్ రీడర్స్‌కు ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి మీటర్ రీడర్స్‌ను, వాళ్ల కుటుంబాలను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న మీటర్ రీడర్స్ కు ప్రభుత్వమే కనీస వేతనాలు అమలు చేయకపోతే ఇక కార్మికులు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు ప్రాంతాల నుండి బయలు దేరిన బైక్ యాత్రలు ఈ నెల 31వ తేదీన విజయవాడలో కలిసి భవిష్యత్తు కార్యక్రమం ప్రకటిస్తాయని వెల్లడించారు.