
ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : మింగ మెతుకులేదంటే మీసానికి సంపంగి నూనె వేసుకోమన్నాడట వెనుకటి ఓ వ్యక్తి. రైతులకు అధికార యంత్రాంగం ఇస్తున్న సలహాలు అచ్చం అలాగే ఉన్నాయి. అసలు నీరే లేదంటే నీటి వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తారట. ఇందుకనుగుణంగా మొన్న (శుక్రవారం) జరిగిన వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పాలకులు, అధికారులు కలిపి కీలక నిర్ణయం చేశారు. ఈ విషయం క్షణాల్లో సోషల్ మీడియా ద్వారా బయటకు వెళ్లడంతో ఔరా..! అంటూ రైతాంగం ముక్కున వేళ్లేసుకుంటోంది. జిల్లాలో సుమారు 70శాతం ప్రజానీకం వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. మరో 10 నుంచి 15శాతం మందికి కూడా పరోక్షంగా వ్యవసాయ రంగమే జీవనాధారం. ఇటువంటి జిల్లాలో వ్యవసాయ ప్రాధాన్యత ఏ మేరకు ఉండాలో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈనేపథ్యంలో క్షేత్రస్థాయిలో వ్యవసాయ సాగు, ఆచరణలో ఇబ్బందులు, తెగుళ్లు, రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అందులో భాగంగా నమోదు చేయాల్సిన ఇ-క్రాప్, ఇన్సూరెన్స్ వంటి నమోదు కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షచేసి రైతులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు వ్యవసాయ సలహా మండళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ, ఇవి కొన్నాళ్లగా మొక్కుబడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా మండలి సభ్యులు, చైర్మన్ మాట్లేందుకు అవకాశం ఇవ్వడం లేదు. ఇంకా చెప్పాలంటే వారు కూడా మాట్లాడేందుకు చొరవ చూపడం లేదు. జెడ్‌పి చైర్మన్ అన్నీ తానై వ్యవహరించడం కూడా ఇందుకు ఒక కారణమని పలువురి వాదన. ఈ సంగతి కాస్త పక్కనబెడితే సమావేశంలో క్షేత్ర స్థాయి పరిస్థితులపై చర్చ సాగడం లేదు. శుక్రవారం నాటి సమావేశంలోనూ ఇదే రకమైన పరిస్థితి కనిపించింది. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, జలాశయాల్లో ఉన్న నీటిని సక్రమంగా వినియోగించుకునేలా రైతులకు అవగాహన కలిగించాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు అధికారులకు సూచించారు. వాస్తవానికి నీరు లేక పొలాలు, ముఖ్యంగా వరి పంట ఎండిపోతోంది. కొన్ని చోట్ల బీటలు వారుతున్నాయి. తోటపల్లి నుండి ఈ ఏడాది 55 వేల ఎకరాలకు నీరందించాలని లక్ష్యం కాగా ఇప్పటికే 45 ఎకరాల వరకు అందించామని అధికారులు సెలవిచ్చారు. వాస్తవానికి అంత నీరు అందడం లేదు. గుర్ల, చీపురుపల్లి, పూసపాటిరేగ మండలాలకు ఈ ఏడాది అసలు నీరే అందలేదు. వర్షపునీటితో ఉబాలు పట్టుకున్నారు. తాజాగా ఆ పంటలన్నీ ఎండిపోతున్నాయి. గత నాలుగేళ్లలో గడిగెడ్డకు నీరు రాకపోవడం ఇదే మొదటిసారి అంటూ గుర్ల రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. పిల్లకాలువలు పూర్తి కాకపోవడం, కాలువల నిర్వహన గాలికి వదిలేయడమే ఇందుకు కారణం. దీన్ని కప్పిపుచ్చుకునే విధంగా సమావేశంలో చర్చసాగినట్టుగా పలువురు విమర్శిస్తున్నారు. ఆండ్ర, తాటిపూడి, మడ్డువలస, పెద్దగెడ్డ, వెంగళరాయ సాగర్ తదితర జలాశయాల్లో నీరు పుష్కలంగానే ఉందంటూ జలవనరుల శాఖ అధికారులు సెలవిచ్చారు. అందుకు జెడ్‌పి చైర్మన్, కలెక్టర్ సహా ఓహో అటూ తలూపేశారు. కానీ, జలాశయాల్లో నీరు ఉంటే పొలాలు ఎందుకు ఎండిపోతున్నాయని మాట వరుసకు కూడా అడగకపోవడం గమనార్హం. ఉన్ననీరు కూడా పొలాల్లోకి వెళ్లే విధంగా కాలువల నిర్వహణ లేదు. వర్షపాతం నమోదు కూడా రైతాంగాన్ని ఆందోళన కలిగిస్తోంది. ఖరీఫ్ సీజన్‌లో అన్ని పంటలూ కలిపి 2,83,912 ఎకరాల్లో సాగవ్వగా, వరి అత్యధికంగా 2,34,437 ఎకరాల్లో సాగైంది. సీజన్ ముగిసేనాటికి (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు) సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ జూన్‌లో 52 మీల్లీ మీటర్లు, ఆగస్టులో 24 మి.మీ వర్షపులోటు ఏర్పడడంతో ఉబాలు పట్టుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సివచ్చింది. అక్టోబర్ 1 నుంచి ఇప్పటి వరకు చినుకు రాలలేదు. 87మి.మీ లోటు వర్షపాతం నమోదైంది. దీనికితోడు ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలన్నీ ఎండిపోతున్నాయి. పంటపొలాలు బీటలు వారుతున్నాయి. ఈనేపథ్యంలో జలాశయాల్లో ఉన్న కొద్దిపాటి నీటిని అందించేందుకు కాలువలు ఉన్నంతలో బాగుచేయించడం లేదా కరువు పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కనీసం చర్చిండం వంటి చర్యలకు సమావేశంలో కనీసం ప్రయత్నించకపోవడం గమనార్హం. ఇక ఇకెవైసి, ఇన్సూరెన్స్, ఇ-క్రాప్ నమోదు వంటివి శతశాతానికి చేరుకోలేకపోవడానికి గల కారణాలు కూడా చర్చించలేదు. ఈనేపథ్యంలో ఇలాంటి సమావేశాలు ఎందుకని, 80శాతం ప్రజానీకం సమస్యలు ముప్పావుగంటలో ముగించారంటే వ్యవసాయ రంగంపై పాలకులకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమౌతోందని జనం చర్చించు కుంటున్నారు.