Jul 19,2023 22:47

పథకాల్లో పేదలకు అన్యాయం జరుగుతోందని ఫిర్యాదు చేస్తున్న మహిళ

- రెల్లిగెడ్డ పనులపై స్పీకర్‌ను ప్రశ్నించిన రైతు
ప్రజాశక్తి - పొందూరు: 
మండలంలోని తాడివలసలో బుధవారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారారకు రెల్లిగెడ్డ పనులపై రైతులు ప్రశ్నించారు. కార్యక్రమంలో భాగంగా స్పీకర్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అవినీతి, కమీషన్ల కక్కుర్తి కారణంగా రెల్లిగెడ్డలో చప్టా నిర్మాణ దశలో ఉండగానే కొట్టుకుపోయిందన్నారు. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. 'మీరు వచ్చి నాలుగేళ్లు అయింది కదా?. మీరెందుకు పూర్తి చేయలేదు' అని ఒక రైతు ఆయన్ను ప్రశ్నించారు. దీనిపై విజిలెన్స్‌ విచారణ జరుగుతోందని, కారకులపై చర్యలు తప్పవని స్పీకర్‌ బదులిచ్చారు. మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ బస్సు యాత్రలో భాగంగా రెల్లిగెడ్డ వద్ద సెల్ఫీ తీసుకుంటారట, ఏం చేశారని తీసుకుంటారని ప్రశ్నించారు. బస్సు యాత్రను అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చాలా పథకాలు గ్రామంలో పెద్ద వాళ్లకే అందుతున్నాయని, పేదోళ్లకు అన్యాయం జరుగుతోందని ఒక మహిళ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. ఇల్లు లేని తనకు ఇళ్లు పట్టా ఇవ్వలేదంటూ మరొకరు ఫిర్యాదు చేశారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు స్పీకర్‌ ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి లోలుగు కాంతారావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, ఎఎంసి చైర్మన్‌ బాడాన సునీల్‌కుమార్‌, ఎంపిడిఒ సీపాన హరిహరరావు, వైసిపి మండల, పట్టణ అధ్యక్షులు పప్పల రమేష్‌కుమార్‌, గాడు నాగరాజు, ఎంపిపి ప్రతినిధి కిల్లి నాగేశ్వరరావు, వైసిపి నాయకులు తమ్మినైన వాసు, పోలయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రశ్నించే హక్కు సర్పంచ్‌కు లేదా?
గ్రామ ప్రథమ పౌరురాలిగా తన పంచాయతీలో చేపడుతున్న పనులు, అవినీతిపై ప్రశ్నించే హక్కు తనకు లేదా? అని తాడివలస సర్పంచ్‌ తమ్మినైన మణెమ్మ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. జల్‌ జీవన్‌ మిషన్‌ పనులపై ప్రశ్నించడానికి సర్పంచ్‌ ఎవరంటూ స్పీకర్‌ అనడమేమిటని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్‌, మరో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న సర్పంచ్‌ను గౌరవించలేరా? అని ప్రశ్నించారు. గ్రామంలో ఇప్పటికే నాగావళి నుంచి పైపులైన్‌ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని, గ్రామ అవసరాలకు తగ్గట్టుగా మరో ట్యాంకు నిర్మాణం చేయకుండా కుళాయిలతో సరిపెట్టారని తెలిపారు.