
ప్రజాస్వామ్యంపై, ప్రజాస్వామ్య హక్కులపై నిరంకుశ ప్రభుత్వం జరిపే విస్తృత దాడిలో భాగమే మీడియాపై దాడి. మీడియా స్వేచ్ఛను, హక్కులను పరిరక్షించడమనేది ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకై జరిపే పోరాటంలో భాగంగా మారాలి. పత్రికా స్వేచ్ఛపై జరిగే ప్రతీ దాడిని ప్రజాస్వామ్య శక్తులన్నీ వ్యతిరేకించాలి, ప్రతిఘటించాలి.
ఐక్యరాజ్య సమితి ప్రకటించిన మేరకు మే 3వ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పాటించారు. అదే రోజున, 'రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్' (రిపోర్టర్స్ శాన్స్ ఫ్రాంటియర్స్) ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీని ప్రచురించింది. ఈ సూచీలో మొత్తం 180 దేశాలకు గాను భారత ర్యాంకు 2021లో 142గా వుండగా, ఈ ఏడాది 150కి పడిపోయింది. 2016లో, భారత్ 133వ స్థానంలో వుంది. అంటే మోడీ ప్రభుత్వ హయాంలో మీడియా స్వేచ్ఛ విషయంలో భారత్ నెమ్మదిగా దిగజారుతూ వస్తోందని ఈ సూచీని బట్టి స్పష్టమవుతోంది.
''జర్నలిస్టులపై జరుగుతున్న హింస, రాజకీయంగా పక్షపాతం ప్రదర్శించే మీడియా, మీడియా యాజమాన్యాల కేంద్రీకరణ'' కారణంగా భారత్‌లో పత్రికా స్వేచ్ఛ సంక్షోభంలో వుందని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ పేర్కొంది.
పత్రికా స్వేచ్ఛ, స్వతంత్ర మీడియా పని తీరు రెండూ మోడీ హయాంలో తీవ్రమైన దాడులకు గురవుతున్నాయి. ప్రభుత్వం మీడియాను బెదిరించడం, నిరోధించడమనేది గుర్తించదగ్గ అంశంగా మారింది. జర్నలిస్టులు, సంపాదకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం, ఢిల్లీ కేంద్రంగా పని చేసే మీడియా సంస్థలకు చెందిన వారిని ఆయా రాష్ట్రాల్లోని కోర్టులకు హాజరు కావాల్సిందిగా పిలిపించడం సర్వసాధారణంగా మారిపోయింది. అధికారంలో వున్నవారికి నచ్చని విధంగా వార్తా కథనాలు ఇచ్చే విలేకర్లపై దేశద్రోహం కేసులు మోపుతున్నారు. అంతకంటే దారుణమైన అంశం ఏమిటంటే, జర్నలిస్టులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం వంటి నిరంకుశ చట్టాన్ని ఉపయోగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని సిద్దిఖి కప్పన్, శ్రీనగర్ లోని ఫహద్ షాలపై ఈ చట్టాన్నే మోపారు. వారిద్దరు ఈనాటికీ ముందస్తు నిర్బంధం పేరుతో ఇంకా జైల్లోనే మగ్గుతున్నారు.
మతోన్మాద తీవ్రవాద ముఠాలు మీడియా సిబ్బందిపై భౌతిక దాడులకు తెగబడుతున్నాయి. ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఈ పరిస్థితి నెలకొంది.
మీడియాను ఇబ్బందుల పాల్జేయడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలు, ప్రభుత్వం పట్ల అవిధేయంగా వుండే మీడియా సంస్థలను లక్ష్యంగా చేసుకుని వారిపై ఆర్థిక నేరాలను మోపేలా రూపాంతరం చెందుతున్నాయి. ఇటువంటి మీడియా సంస్థలను వేధింపుల పాల్జేయడానికి, వాటిని ఎదుర్కొనడానికి ఆదాయ పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్...ఇతర సంస్థలను ఉపయోగించుకుంటున్నారు.
ప్రభుత్వ నియంత్రణ, సెన్సార్‌షిప్‌ను విస్తరించేందుకు చేసే ప్రయత్నాలు అన్ని రకాల మీడియాకు విస్తరించబడుతున్నాయి. డిజిటల్ వార్తా వేదికల వ్యాప్తిని దృష్టిలో వుంచుకుని, సమాచార సాంకేతిక చట్టం కింద కొత్త నిబంధనలను 2021లో ప్రవేశపెట్టారు. డిజిటల్ న్యూస్ మీడియా వేదికలకు ఎలాంటి సమాచారం ఇవ్వాలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను నిర్దేశించేందుకు ఈ నిబంధనలు అనుమతిస్తాయి. అభ్యంతరకరంగా వున్నట్లు పరిగణించిన డిజిటల్ సమాచారాన్ని తొలగించే హక్కును ప్రభుత్వానికి ఇస్తోంది. మొత్తంమీద పరిమిత కాలం లేక శాశ్వత ప్రాతిపదికన వార్తా చానళ్ళపై నిషేధం విధించడం ద్వారా ఇవన్నీ కూడా మీడియా గొంతు నులిమివేసే దారుణమైన చర్యలుగానే వున్నాయి. మీడియా యాజమాన్యాల స్వభావాల కారణంగా కూడా మీడియా స్వేచ్ఛ, సమగ్రతలపై రాజీ పడాల్సి వస్తోంది. ఈనాడు మీడియాలో మెజారిటీ భాగం బడా కార్పొరేట్ సంస్థలు లేదా వ్యాపార సంస్థల అధీనంలోనే వుంది. ముఖ్యంగా, కొన్ని మినహాయింపులతో వారికి ఎలక్ట్రానిక్ మీడియా వుంది. ప్రభుత్వానికి చీర్ లీడర్లుగా వ్యవహరించేందుకు మోడీ ప్రభుత్వం వీటిని నియమించుకుంది. అంతకన్నా అధ్వాన్నమైన అంశం ఏమంటే, వీటిలో కొన్ని చాలా దూకుడుగా హిందూత్వ మతోన్మాద ప్రచారం చేయనారంభించాయి. ప్రధాన స్రవంతిలోని మీడియాలో ఈ ప్రధానమైన మార్పు కార్పొరేట్-హిందూత్వ మధ్య నెలకొన్న సంబంధాలను ప్రతిఫలిస్తోంది. మాస్ మీడియా ముఖ్యంగా హిందీ మీడియాపై ఇది ప్రమాదకరమైన ప్రభావాన్ని కలిగిస్తోంది. ప్రజాస్వామ్య దేశంలో మీడియా పోషించాల్సిన పాత్రను అపహాస్యం చేయడం ఇక్కడ కనిపిస్తోంది. ప్రభుత్వానికి మద్దతుదారులుగా వుండడంతో పాటుగా మీడియాలో గణనీయమైన వర్గం ఈ ప్రమాదకర మతోన్మాద ప్రచారానికి పర్యవేక్షకులుగా మారుతున్నారు. హిందీ వార్తా చానళ్ళ విలేకర్లు కొంతమంది జహంగీర్‌పురిలో బుల్డోజరుతో ఇళ్ళ కూల్చివేత వ్యవహారాన్ని ప్రేరేపించడం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే.
పైగా...సక్రమంగా, నిష్పక్షపాతంగా రిపోర్టింగ్ జరపాలనుకునే జర్నలిస్టులు, సంపాదక స్వేచ్ఛను పాటించే మీడియా ఈనాడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. వారిపై ప్రభుత్వం తన బలాన్ని ప్రయోగిస్తోంది.
మీడియా హక్కులను పరిరక్షించడం కోసం జ్యుడీషియల్ జోక్యం కల్పించుకునే అవకాశాలు చాలా పరిమితమయ్యాయి. దేశద్రోహం ఆరోపణలపై అరెస్టులను లేదా చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు కొన్ని కేసుల్లో కోర్టులు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. అయితే, యుఎపిఎను ఉపయోగించడం వంటి చర్యల ద్వారా జర్నలిస్టులను వేధించడానికి చట్టాలను దారుణంగా దుర్వినియోగం చేయడాన్ని నిలువరించేందుకు అత్యున్నత న్యాయస్థానం మాత్రం జోక్యం చేసుకోవడం లేదు. మీడియా ఇచ్చే సమాచారంలో ప్రభుత్వ జోక్యాన్ని అణచివేయడానికీ చర్యలు తీసుకోవడం లేదు.
ప్రజాస్వామ్యంపై, ప్రజాస్వామ్య హక్కులపై నిరంకుశ ప్రభుత్వం జరిపే విస్తృత దాడిలో భాగమే మీడియాపై దాడి. మీడియా స్వేచ్ఛను, హక్కులను పరిరక్షించడమనేది ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకై జరిపే పోరాటంలో భాగంగా మారాలి. పత్రికా స్వేచ్ఛపై జరిగే ప్రతీ దాడిని ప్రజాస్వామ్య శక్తులన్నీ వ్యతిరేకించాలి, ప్రతిఘటించాలి.
( 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం)