
ప్రజాశక్తి-కలక్టరేట్(కృష్ణా) : కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మీడియాపై దాడులకు తెగబడడాన్ని పలువురు ప్రజాతంత్రవాదులు తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో న్యూస్‌క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థ, భాషాసింగ్, ఊర్మిళేష్, తీస్తా సెల్వలాద్, అభిసార్ శర్మ, అమిత్‌చక్రవర్తి, సుభోధ్‌వర్మతో సహా పలువురు జర్నలిస్టుల నివాసాలపై ఢిల్లీ పోలీసులు జరిపిన దాడులను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యు జెఎఫ్) కష్ణాజిల్లా కమిటీ ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని కలెక్టరేట్ ఎదుటనున్న గాంధీ విగ్రహం వద్ద గురువారం ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ మచిలీపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి జి.కిశోర్‌కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగ బద్ధంగా కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛగా విఘాతం కల్పించేలా కేంద్రప్రభుత్వ చర్యలు ఉన్నాయని విమర్శించారు. ఎపిడబ్ల్యుజెఎఫ్ కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు, సిఐటియు కష్ణాజిల్లా కోశాధికారి బూర సుబ్రహ్మణ్యం, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ రాజేష్, పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా నాయకులు కొడాలి శర్మ, సిఐటియు మచిలీపట్నం మండల కార్యదర్శి జయరావు, ఎల్‌ఐసి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు టి.చంద్రపాల్, కెవిపిఎస్ మచిలీపట్నం నగర అధ్యక్షులు ఎంఎ బెనర్జీ, బిఎస్ ఎన్‌ఎల్ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఎండి యూనస్, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు డి.రాంబాబు, కె.శ్రీను, కె.జాకబ్ పాల్గొన్నారు.