మీడియాకు వ్యతిరేకంగా ఇచ్చే గాగ్ ఆదేశాల వల్ల ఎప్పుడూ రెండు రకాలుగా తీవ్ర పర్యవసానాలు వుంటాయి. అటు భావ ప్రకటనా స్వేచ్ఛకు, ఇటు పౌరులు తమకు కావాల్సిన సమాచారాన్ని పొందే హక్కుకు భంగం కలుగుతుంది. ముఖ్యమైన కేసులకు సంబంధించిన వార్తా కథనాలు ఇవ్వడం, లేదా కొన్ని కార్యక్రమాలు ప్రసారం కాకుండా మీడియాను నియంత్రించాలంటూ వివిధ కోర్టులు ఈ వారంలో ఇచ్చిన ఆదేశాలు, సంయమనం పాటించడం, మీడియా స్వేచ్ఛ, దర్యాప్తును ఎదుర్కొంటున్న వ్యక్తులకు సక్రమ విచారణకు గల హక్కు వంటి పలు ప్రశ్నలను మన ముందుకు తెచ్చాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ ప్రభృతులపై పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి ఏ విషయాలను ప్రస్తావించకుండా వుండాలంటూ సోషల్ మీడియాతో సహా అన్ని రకాల మీడియాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిషేధం విధిస్తూ తీసుకు వచ్చిన తాత్కాలిక ఉత్తర్వులు పూర్తి అసాధారణమైనవి. చట్టబద్ధంగా ప్రశ్నించదగిన నిర్ణయం. ఇది బలవంతంగా రుద్దిన కేసు అంటూ పిటిషనర్ ఆరోపణ మినహా ఇటువంటి సెన్సార్‌షిప్‌ను సమర్ధించడానికి మరే ఇతర కారణం వున్నట్లు కనిపించనందున ఇదొక అసాధారణమైన విషయంగా తోస్తున్నది. పైగా దీనితోపాటే దర్యాప్తుపై స్టే ఇస్తూ మరో ఆదేశం కూడా వెలువడింది. వాస్తవానికి, అసాధారణ కేసుల్లో దర్యాప్తుపై స్టే మంజూరు చేయడానికి హైకోర్టుకు అధికారం వుంది. అయితే, ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ ప్రతీకారంతో చేస్తోందని ఆరోపణలు వచ్చినపుడు...అది కూడా గత ప్రభుత్వ హయాంలో న్యాయాధికారిగా పనిచేసిన వ్యక్తి వాటిని చేసినపుడు...వాటిపై మీడియా కవరేజ్, ప్రజా పరిశీలన అవసరం చాలా వుందని చెప్పాలి. ఏ విధమైన వార్తా కథనాలు లేదా కవరేజ్ లేకుండా వుంటే పిటిషనర్ ఏ విధంగా లబ్ధి పొందుతారో ఈ ఆదేశాల్లో స్పష్టంగా లేదు. దీనివల్ల ఎలాంటి పస లేని ఆరోపణల నుండి చట్టబద్ధమైన వ్యాఖ్యల వరకు కూడా అన్నీ నిరోధించబడతాయి.
పరువు నష్టం జరగకుండా నివారించడానికి లేదా ప్రైవసీని దెబ్బ తీయడాన్ని నివారించేందుకు లేదా దర్యాప్తు లేదా విచారణ సక్రమంగా సాగేందుకు ఉద్దేశించి ఇచ్చే ఆదేశాలుగా ఈ ఇంజక్షన్ ఉత్తర్వులు వుంటాయి. స్వేచ్ఛా విచారణ, స్వేచ్ఛా ప్రెస్‌కు గల హక్కును సమతూకంగా చూడడంపై కోర్టు ముందస్తు రిలీఫ్ మంజూరు చేయగలదంటూ 2012లో 'సహారా వర్సెస్ సెబి' కేసులో సుప్రీం కోర్టు ఇదే చేసింది. అయితే, స్వేచ్ఛా విచారణకు లేదా న్యాయపాలనకు వాస్తవ, గణనీయమైన ముప్పు వున్న కేసుల్లో మాత్రమే ప్రచురణలపై ఇటువంటి తాత్కాలిక సంయమనం లేదా నిగ్రహం పాటించాల్సి వుంటుంది. ఇదిలావుండగా, అదే రోజు సుప్రీంకోర్టు చాలా ముఖ్యమైన తాత్కాలిక ఆదేశాలను జారీ చేసింది. వేర్వేరు కారణాలపై సుదర్శన్ న్యూస్ చానెల్‌లో ప్రసారమవుతున్న సిరీస్ లోని మిగిలిన ఎపిసోడ్‌లను ప్రసారం చేయకుండా ఆపాలని కోరింది. అప్పటికి నాలుగు ఎపిసోడ్‌లు ప్రసారమయ్యాయి. ముస్లింలను దుర్భాషలాడడం మినహా మరేమీ ఆ కార్యక్రమంలో లేనందున మరిన్ని ఎపిసోడ్‌లు ప్రసారం కాకుండా నిషేధించాల్సిన అవసరం వుందని కోర్టు అభిప్రాయపడింది. ఇక్కడ భావ ప్రకటనా స్వేచ్ఛకు, విద్వేష ప్రచారానికి మధ్య గల తేడాను కోర్టు చూసినట్లు తెలుస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో, కొన్ని సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా కర్నాటకలో తమ గురించి ఎలాంటి వార్తలు రాకుండా నివారించేందుకు కొంతమంది అన్ని మీడియా సంస్థలకు వ్యతిరేకంగా పలు తాత్కాలిక ఇంజక్షన్ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఒక వార్తా కథనం కారణంగా తమ పరువు పోయిందని చెప్పుకుంటూ వారు అన్ని మీడియా సంస్థలపై దావా వేశారు, వారికి సంబంధించి ఎలాంటి ప్రయోజనం లేని కథనాలతో పాటుగా అన్నింటిపై స్టే తెచ్చుకున్నారు. సూత్రప్రాయంగా చూసినట్లైతే, కోర్టులు మీడియా ప్రచురణలకు వ్యతిరేకంగా ఒకేసారి ఇన్నేసి ఉత్తర్వులు ఇవ్వడాన్ని నివారించాలి. ఇటువంటి ఆదేశాలు సమాచారం తెలుసుకునే హక్కుకు విఘాతంగా మారతాయి.
* ('ది హిందూ' సంపాదకీయం)










