May 21,2023 21:23

డ్రోన్‌ పనితీరును పరిశీలిస్తున్న మంత్రి విడదల రజిని

ప్రజాశక్తి - చిలకలూరిపేట : జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష పథకంతో భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు వీలేర్పడిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. మీ భూమి - మా హామీ కార్యక్రమం కింద పట్టణంలో చేపడుతున్న భూ సర్వేను మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్రోన్‌ పనితీరును పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భూ రక్ష పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 90 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందన్నారు. గట్టు తగాదాలు ఇకపై ఉండబోవని, భూ వివాదాలకు ఇది శాశ్వత పరిష్కారమని చెప్పారు. బలవంతులు ఎవరి భూమినైనా ఆక్రమిస్తే.. ప్రభుత్వమే ఆ భూమిని విడిపించి బాధితులకు అందజేసే గొప్ప కార్యక్రమన్నారు. 22.6 కోట్ల వ్యవసాయ భూమి, గ్రామాల్లో 85 లక్షల ఆస్తులు, పట్టణాల్లో 40 లక్షల స్థిరాస్తులు, 10 లతక్షల ప్లాట్లకు ఈ సర్వే జరుగుతుందని వివరించారు. సర్వే పూర్తయితే భూ రికార్డులన్నీ డిజిటల్‌ రూపంలో అందుబాటులో ఉంటాయని, శాశ్వత భూ హక్కు పత్రాన్ని కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు రాతంశెట్టి సీతారామాంజనేయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.