May 11,2023 19:48

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి, సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌

ప్రజాశక్తి - ఆదోని
'మీ వల్ల ఆస్పత్రికి చెడ్డ పేరు వస్తోంది. దండం పెడతాం. విధులకు రిజైన్‌ చేసి వెళ్లాల'ని ఆస్పత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్‌ రెడ్డి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగేలా వైద్యులు, సిబ్బంది విధులు నిర్వహించాలని సూచించారు. గురువారం ఆదోని ఏరియా ఆస్పత్రిలో సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాత్రి వేళల్లో విధులకు డుమ్మా కొట్టి ప్రయివేట్‌గా ప్రాక్టీస్‌ చేయడం ఏమిటని డాక్టర్‌ ఆది నాగేష్‌, డాక్టర్‌ వినరుపై ఎమ్మెల్యే సమావేశంలో ఆక్రోశం వెల్లగక్కారు. వైద్యుల కొరత రాకుండా నియామకం చేపట్టినా, ఎందుకు సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆస్పత్రిలో నిర్మాణంలో ఉన్న పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. శానిటేషన్‌పై ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. గతంలో కంటే అధునిక పరికరాలు, ఆక్సిజన్‌ ప్లాంట్‌, ఆల్ట్రా సౌండ్‌, బ్లడ్‌ బ్యాంక్‌, వివిధ సదుపాయాలు ఏర్పాటు చేశామని చెప్పారు. భవిష్యత్తులో మెడికల్‌ కళాశాల పూర్తయ్యే సరికి ఆదోని డివిజన్‌లోని మండలాలు, గ్రామాలకు వైద్య కేంద్రంగా మారుతుందన్నారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ మాట్లాడారు. ప్రతి నెలా అభివృద్ధి కమిటీ పర్యవేక్షించి పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రతివారం ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టి, చెక్‌ లిస్ట్‌ తయారు చేసి నివేదికలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. వైద్యులు సమన్వయం పాటించి అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌, ఇన్‌ఛార్జీ డిప్యూటీ డిఎంహెచ్‌ఒ బాల మురళీ, అభివృద్ధి కమిటీ సభ్యులు గోపాల్‌ రెడ్డి, చంద్రకాంత్‌ రెడ్డి, శోభ లత, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లింగన్న, డాక్టర్‌ పద్మ కుమార్‌, డాక్టర్‌ నవీన్‌, డాక్టర్‌ ఆది నాగేష్‌, డాక్టర్‌ రవికుమార్‌, వైద్యాధికారులు పాల్గొన్నారు.