మీ పిల్లలకూ ఇలాగే పెడతారా..?
మధ్యాహ్న భోజనం నిర్వాహకులపై త్రిసభ్య కమిటీ ఆగ్రహం
ప్రజాశక్తి - పగిడ్యాల
'విద్యార్థుల హాజరు తగ్గట్లుగా భోజనం ఎందుకు చేయలేదు.. విద్యార్థులకు సగమే పెట్టి వారిని అర్థాకలితో కడుపు మాడుస్తారా..? మీ పిల్లలకయితే ఇలాగే పెడతారా.. ' అంటూ మధ్యాహ్న భోజనం నిర్వాహకులు త్రిసభ్య కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పగిడ్యాలలోని మోడల్ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం పథకాన్ని త్రిసభ్య కమిటీ సభ్యలు ఎంపిడిఒ వెంకటరమణ, ఎంఇఒ సుభాన్, తహశీల్దార్ భారతి తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనానికి 376 మంది విద్యార్థులు హాజరు వేస్తే 320 మందికి మాత్రమే భోజనం చేయడంపై అగ్రహం వ్యక్తం చేశారు. ఇంత తేడా వంట చేసి విద్యార్థులకు ఆర్థాకలితో భోజనం పెట్టడం సరికాదన్నారు. విద్యార్థులకు సరిపడా భోజనం ఎందుకు వండలేదని నిర్వాహకులను ప్రశ్నించారు. పులిహోర కూడా రుచికరంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. మీ ఇంటో పిల్లలకైతే ఇలానే భోజనం వండి పెడతారా అని మండిపడ్డారు. భోజనాన్ని రుచికరంగా నాణ్యతతో మెనూ ప్రకారం చేయాలన్నారు. రుచికరంగా చేయని పక్షంలో నోటీసులు ఇస్తామన్నారు. ఇక ముందు ఇలాంటివి జరిగితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సక్రమంగా సరైన పద్ధతితో పెట్టాలని ఆదేశించారు.










