Sep 16,2023 20:36

సిబ్బందిని నిలదీసిన విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్‌
పలు విద్యాసంస్థల్లో ఆకస్మిక తనిఖీలు
ప్రజాశక్తి - పాలకొల్లు
విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్‌ పాలకొల్లులోని ఎస్‌కెపి, టివిఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌, ఎంవిఎస్‌ ప్రయిమరీ స్కూల్‌, సిహెచ్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ఎ మున్సిపల్‌ స్కూల్‌, ఎఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. అలాగే మసీదు ఎదురుగా ఉన్న 6వ వార్డు సచివాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అయితే విద్యా ప్రమాణాలు సరిగ్గా లేవని, టీచింగ్‌ సిబ్బంది బాధ్యతగా చెప్పడం లేదని, మీ పిల్లలైతే ఇలాగే ఊరుకుంటారా అని పలు స్కూళ్లల్లో సిబ్బందిని నిలదీశారు. ఎవరికి వారు పైవారు చూసుకుంటారని వదిలేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కనీసం జిల్లా అధికారులు కూడా బాధ్యతగా ఉండడం లేదన్నారు. కళాశాల విద్యార్థులు కొందరు ఫీజులెందుకు కట్టడం లేదో వారి ఇంటికి వెళ్లి కొనుక్కుందామని చెప్పారు. కొంత మంది సిబ్బంది ఇంటి నుంచి తాగునీరు తెచ్చుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వం రూ.6 లక్షలు ఖర్చు చేసి ఆర్‌ఒ వాటర్‌ ప్లాంట్‌ పెట్టిందని సిబ్బంది ఇంటి వద్ద నుంచి నీరు తెచ్చుకుంటే విద్యార్థులకు నమ్మకం ఎలా ఉంటుందని నిలదీశారు. ప్రిన్సిపల్‌, సిబ్బంది కళాశాల వాటర్‌ ప్లాంట్‌ నీరు తాగాలన్నారు. కళాశాలలో 280 మంది విద్యార్థులు ఉండగా 24 మంది టీచింగ్‌ సిబ్బంది ఎందుకని, వెంటనే వారిని ఫ్లస్‌ వన్‌కు బదిలీ చేయాలని కోరారు. మరలా తాను వచ్చినప్పుడు విద్యాబోధన మెరుగుకాకపోతే సస్పెండ్‌ అవుతారని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన తరగతి గదులను సందర్శించి అధ్యాపకులను సిలబస్‌ పురోగతి, పాఠ్య ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల నోట్‌ పుస్తకాలను పరిశీలించారు. తరగతి గదిలో కనీసం 80 శాతం విద్యార్థుల నోట్‌బుక్స్‌ అధ్యాపకులు తప్పనిసరిగా పరిశీలించి తప్పులు సరిదిద్దాలని, ఈ ప్రక్రియను ప్రిన్సిపల్‌ నిరంతరం పర్యవేక్షించాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపల్స్‌ తప్పక పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఇఒ ఆర్‌వి.రమణ, ఆర్‌జెడిలు శారద, లక్ష్మీ, ఎంఇఒ గుమ్మళ్ల వీరాస్వామి, మున్సిపల్‌ కమిషనర్‌ శేషాద్రి, తహశీల్దార్‌ సిహెచ్‌ పెద్దిరాజు పాల్గొన్నారు.