* ప్రతీ పౌరుడు యూనిఫామ్ లేని పోలీసే
* ఎస్‌పి జి.ఆర్ రాధిక
ప్రజాశక్తి - శ్రీకాకుళం: బాధ్యత గల ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీసేనని ఎస్‌పి జి.ఆర్ రాధిక అన్నారు. విద్యార్థి దశలో సామాజిక బాధ్యతతో పాటు క్రమశిక్షణ, సమయపాలన వంటి మంచి లక్షణాలు అలవాటు చేసుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన క్యాంపస్ కాప్స్-2ను నగరంల్నోఇ బాపూజీ కళా మందిరంలో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో శ్రీకాకుళం, టెక్కలిలో ప్రవేశపెట్టిన క్యాంపస్ కాప్స్‌లో సుమారు 213 మంది విద్యార్థులు శిక్షణ పొందిన తర్వాత 780 గంటలు పోలీసులతో విధి నిర్వహణలో సహకారాన్ని అందించారని తెలిపారు. దిశ యాప్ రిజిస్ట్రేషన్, ట్రాఫిక్ రూల్స్, ముఖ్యమైన చట్టాలు తదితర అంశాలపై మళ్లీ ఇప్పుడు జిల్లావ్యాప్తంగా అన్ని సర్కిల్ హెడ్‌క్వార్టర్స్‌లో మూడు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. అంకితభావం, క్రమశిక్షణే క్యాంపస్ కాప్స్‌కు మొదటి అర్హత అని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కువ యువత పోక్సో కేసుల్లో నేరస్తులుగా నమోదవుతున్నారని తెలిపారు. విద్యార్థి దశలోనే ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అసాంఘిక కార్యకలాపాల సమాచారాన్ని సంబంధిత పోలీసు అధికారులకు తెలపాలని, వారి విషయాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. యువత సైబర్ నేరాలు బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం గతంలో క్యాంపస్ కాప్స్‌లో పాల్గొన్న పలువురు విద్యార్థులు వారి అనుభవాలను పాలుపంచుకున్నారు. శిక్షణలో నేర్పనున్న అంశాలపై ముద్రించిన బుక్‌లెట్‌ను ఎస్‌పి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్‌ఇబి అదనపు ఎస్‌పి ఎన్.మణికంఠ, అదనపు ఎస్‌పిలు టి.పి విఠలేశ్వర్, జె.తిప్పేస్వామి, డిఎస్‌పిలు వై.శృతి, సిహెచ్.జి.వి ప్రసాద్, డి.విజరుకుమార్, సిఐలు, పోలీసు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
డిఎస్‌పి కార్యాలయం తనిఖీ
వార్షిక తనిఖీలో భాగంగా శ్రీకాకుళం సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని ఎస్‌పి సందర్శించి పలు ముఖ్యమైన రికార్డుల నిర్వహణ, ముఖ్యమైన గ్రేవ్ కేసుల దర్యాప్తుపై కేసు ఫైళ్లను తనిఖీ చేశారు. సబ్ డివిజన్ పరిధిలోని నేర నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. గ్రేవ్ కేసులు జరిగేందుకు అవకాశం ఉన్న గ్రామాల్లో ప్రతిరోజూ పోలీస్ సిబ్బంది సందర్శించి ప్రశాంత వాతావరణం నెలకొల్పేలా గ్రామ పెద్దలతో మాట్లాడాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. తనిఖీలో డిఎస్‌పి వై.శృతి, సిఐలు ఎల్.ఎస్ నాయడు, పి.శ్రీనివాసరావు, పైడయ్య, ఆదాం ఉన్నారు.










