ప్రజాశక్తి- పరిగి : 'మీకాళ్లు పట్టుకుంటాం.. ఇసుక అక్రమ తరలింపును ఆపండి' అని పరిగి గ్రామస్తులు సబ్‌కలెక్టర్‌ను వేడుకున్నారు. సోమవారం డివిజన్ స్థాయి స్పందన కార్యక్రమం పరిగి మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డివిజన్ స్థాయి అధికారులతో పాటు మండలంలోని ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ స్పందన కార్యక్రమానికి పలువురు తమ సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు ఇందులో భాగంగా పరిగి గ్రామస్తులు తమ సమస్యను విన్నవించారు. రెండు నెలల నుండి జయమంగలి నది ద్వారా ఇసుక రీచ్ పేరుతో వందల టిప్పర్ల ఇసుకను తరలిస్తున్నారని వాపోయారు. ఈ తరలింపును అడ్డుకున్నా అధికారులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఇసుక తరలింపును వెంటనే నిలుపుదల చేయకపోతే పరిగి మండలం మరోసారి కరువు మండలంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన సబ్‌కలెక్టర్ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యే విధంగా కషి చేస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా మండల కేంద్రంలో శిథిలావస్థలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని పునరుద్ధరించాలని, అదే స్థలంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎంఆర్‌పిఎస్ నాయకులు సబ్‌కలెక్టర్‌ను కోరారు. మండల వ్యాప్తంగా విద్యాసంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫీజుల నియంత్ర నియంత్రణపై విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని రమేష్ కోరారు. పరిగి చెరువు పరిధిలో ఉన్నా ఆయా కట్టు భూములకు నీటిని విడుదల చేయాలని వైసిపి నాయకులు డివి రమణ, చిన్న పల్లి జయరాం సబ్ కలెక్టర్ కోరారు. మండలంలోని ప్రెస్ క్లబ్ కోసం 10 సెంట్లు స్థలాన్ని కేటాయించి ప్రెస్ క్లబ్ నిర్మాణానికి నిధులు సమకూర్చాలని పరిగి విలేకరుల సంఘం అధ్యక్షుడు హరిప్రసాద్ తోటి విలేకరులతో సబ్ కలెక్టర్ ను కలిసి కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులతో పాటు తహశీల్దార్ సౌజన్య లక్ష్మి, ఎంపీడీవో సరస్వతి, ఎంఇఒ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.










