
'నాకు మా అమ్మా అయ్యలు వద్దు.. వాళ్ల ఆస్తులూ వద్దు.' తెగేసి చెప్పింది మీనాక్షి పంచాయితీలో.
'అట్లంటే ఎట్లమే! ముసిలోల్లు యాడికి పోతారు?' రాఘవరెడ్డి అన్నాడు.
'యాడికో యాల మామా! వాల్లకు ఇల్లు.. వాకిలీ.. లేదా ఏంది?'
'అయ్యన్నీ ఇడిసి పెట్టే కదా నీ దెగ్గరికి వచ్చిండేది?' గంగరాజు అన్నాడు.
'అది గదా వాల్లంత వాల్లు వొచ్చినారా? అల్లుడు రమ్మంటేనే కదా వొచ్చింది? ఏంరా జగనా? ఆ పొద్దు మా జోరుగా పిలచకపోతివి.. ఈ పొద్దు ఈ పంచాయితీ ఏందిరా?' మీనాక్షి భర్త జగన్నాథాన్ని ప్రశ్నించాడు సుబ్బయ్య.
'అవును పెద్దయ్యా! అదే నాగ్గడా అర్థమైతలేదు. అమ్మా అయ్యలు లేనోన్ని. వాల్లే నాకు అమ్మా అయ్యలు అనుకుంటి. వాల్లు గడా నన్ను కొడుకు మాదిరే చూసుకుంటుండారు. ఇప్పుడు గడా నేను వాల్లని పొమ్మనడం లేదు. ఈ మీనాచ్చికే.. ఏం దెయ్యం పట్టిందో ఏమోగని.. వాల్లు ఇంట్లో వద్దంటే.. వద్దని రచ్చ చేస్తాంది'. అమాయకంగా చూశాడు.
'ఏంది మే నీ రచ్చ? జగన్ వద్దనడం లేదు. నీకేం బాధ?' రంగారెడ్డి అడిగాడు .
'బాధ నాకు గాక ఇంకెవరికుంటాది చిన్నయ్యా! నా కాపరం, నా కుటుంబరం.. బాగుండద్దా?'.
'ఇప్పుడు మీ కుటుంబరానికి వచ్చిన బాదేంది మే? మీ అమ్మా అయ్యలు మీతో వుంటే మీకు లాభమేగానీ నష్టమేమొచ్చిండాది? వాల్లను నువ్వేమన్నా కూసోబెట్టి సాకతాండావా ఏంది? మీయమ్మ ఎప్పుడూ ఏదోకపని చేస్తానే ఉంటాది. మీ నాయన ఇప్పుడు గడా ఎంత కష్టం చేస్తాడు? మన పల్లిలో ఎగసాయం పనుల్లో మీ నాయన్ను మించినోడు లేడు తెలుసా? తన మాదిరే కష్టపడతాడనే కదా మీ నాయన జగన్‌ను కోరి కోరి అల్లున్ని చేసుకొనిందీ?'.
'కష్టపడే వాళ్లు కష్టపడే వొయసులో కష్టపడకపోతే కడుపెట్టా నిండతాది మామా? అట్లని వొయసుడిగిన కాలంలో గడా కష్టపడాలంటే ఎంత కష్టమో.. పెద్దోళ్లు.. మీకు తెల్వదా?'.
మీనాక్షి మాటలకు జగన్ మొహం కోపంతో ఎర్రబడింది.
'సర్లే మే! ఎవరో ఒకరు కష్టపడకపోతే కుటుంబరం జరిగేదెట్టా?'.
'కుటుంబరం బాద్దెత.. కుటుంబర యజమానిది కదా మామా? మా కుటుంబరం బాగోగులు మావి. మేమే చూసుకోవాల!'.
'మీనాచ్చీ! నువ్వేం మాటాడుతుండావో మాకేం అర్థం కావడం లేదు. మీ కుటుంబరం బాగుండాలనే కదా మీ అమ్మా అయ్యలు ఈ వొయసులో కూడా కష్టపడతాండారు? వాల్లకున్న బంగారమంటి మడి గడా మీకే ఇచ్చేసుండారు? ఇంగేం కావల్ల నీకు?'
'ఎవరు ఎంత కష్టపడినా నా కుటుంబరము ఎగబడత లేదు మామా! దినదినానికీ కనాకష్టమైపోతాంది. దానికి కారణం ఏందో మీకు తెలవదా?' మీనాక్షి సూటిగా చూసింది పంచాయితీ పెద్దల వేపు.
మీనాక్షి మాటలు అర్థమైన జగన్నాథం కోపంతో రగిలిపోతున్నాడు. ఎవరూ మాట్లాడలేదు కానీ అందరి చూపులూ జగన్నాథóం పైనే ఉన్నాయి. అది మరీ భరించరానిదిగా ఉందతనికి. ఆవేశంతో ఒక్క అడుగు మీనాక్షి వైపు వేశాడు.
అంతలో మీనాక్షి నోరు తెరిచింది 'పెద్దోళ్లు.. మీకు అన్నీ తెలుసు. మనకేల లే అని అనుకొనేవాల్లుంటారు. మనకేమన్నా లాబమొస్తాదాని చూసేవాల్లూ ఉంటారు. నేను... ఆసపోతు కంసాలోడిని అనడం లేదు. నా బంగారాన్ని బధ్రం చేసుకోవాలనుకొంటుండాను. అంతే! మా పెండ్లయినప్పుడు మా ఇంటాయనకు ఎంత పొలం వునింది? ఇప్పుడేముందో మీకు తెల్వదా?' మీనాక్షి సూటి ప్రశ్నకు పంచాయితీ పెద్దల్లో కొందరు తేలుకుట్టిన దొంగల్లా తడబడిపోయారు.
'నువు బలే చెప్తావుమే! మీ ఇంటాయన అమ్ముకొంటే పాపం మీ అమ్మా అయ్యలేం చేస్తారు? వాల్లేమన్నా చెప్పినారా అమ్మేయమని?' సుశీలమ్మ ప్రశ్నించింది.
'అవును పెద్దమ్మా! అమ్మేయమని చెప్పలేదు. అమ్మ వద్దని గడా చెప్పలేదు. అసలుకు అల్లున్ని అడిగేదానికి వాల్లకు హక్కే లేదు. అయినాగడా వియ్యపోల్లు ఇంట్లో ఉంటే.. ఇదో.. ఇట్లనే చంక నాకిపోతారని పెద్దోల్లు అంటారు గదా! అందుకే వాల్లు నా ఇంట్లో వద్దు పెద్దమ్మా! వాల్ల బతుకేందో వాల్లను బతకనీ! వాల్ల గంజి వాల్లుని పెశాంతంగా తాగనీ! ఎవురి బాధలు వాల్లే పడాల! ఒకరి దయాదాచ్చిన్యాలతో ఎల్ల కాలమూ బతకాలంటే ఎట్లా?'
'ఆ! ఆ! నీ దయాదాచ్చిన్యాలు వాల్లకేమీ అక్కర్లేదులే మే! వాల్ల పొలం వాల్లకి ఇచ్చినా.. వాల్ల పొద్దులు గడవకపోదు. అసలుకు వాల్ల దయాదాచ్చిన్యాలు నీకే కావాల!' సుశీలమ్మ కోపంగా అంది.
'నాకెవరి దయాదాచ్చిన్యాలూ అక్కర్లేదు పెద్దమ్మా! నా మట్టుకు నేను మా అమ్మ అయ్యల్ని ''మీ ఇంటికి పొండి'' అనేసుందును. మల్లా మీరంతా ఎందుకట్లా తరిమేసినావు ముసిలోల్లను.. అని నా మొగాన అడుగు తారు. అడిగే పెతి ఒక్కరికీ బదులు చెప్పను నావల్ల కాదు. అదీగాక మాకూ వాల్లకూ ఏ సమ్మంధమూ లేదని మీకంతా తెలియాల! అందుకే పెద్దలను పిలిపించి, పంచాయితీ పెట్టించినా. అందురి ముందరా చెప్పేసినా! ఇంగ నాకు మా అమ్మా అయ్యలకు ఎటువంటి సమ్మంధమూ లేదు. వాల్ల పొలం వాల్లదే. మాకు వద్దు. వాల్లు ఎవరికన్నా వారానికి ఇచ్చుకుంటారో.. వాల్లే కష్టపడి పండించుకుంటారో.. అమ్ముకుంటారో.. అంతా వాల్ల ఇష్టమే ఇంగ!' తన తుది నిర్ణయం గట్టిగా చెప్పి, లేచింది మీనాక్షి.
'ఉండు మే ! ఉండు. ఒగ మాట మీ అమ్మాఅయ్యల్ని అడగనీ!' సుబ్బయ్య మాటలకు ఆగింది మీనాక్షి.
'మంగమ్మా! సాంబయ్యా! మీరేమంటారు?'
ఇంత జరుగుతున్నా.. ఇంతసేపూ ఒక్కమాటా మాట్లాడలేదు ఇద్దరూ. ఇప్పుడు నోరు తెరవక తప్పదు.
'ఏమనేదానికి ఏముండాది సుబ్బయ్యా? మా బిడ్డ బాగుకంటే మాకు ఇంకేం కావాల? ఆ బిడ్డ ఇష్టమే మా ఇష్టం గదా!' సాంబయ్య గంభీరంగా చెప్పాడు.
'హు! అడ్డాల నాడు బిడ్డలు గానీ, గడ్డాల నాడు కాదని పెద్దోళ్లు ఊరికే అనలేదు. బిడ్డను.. బిడ్డమొగుడ్ని.. పిలకాయల్ని.. కళ్లల్లో పెట్టుకుని చూస్కొంటిరి. కడుపున పుట్టినబిడ్డే మీరు వొద్దు పొమ్మంటాంటే ఏం చేసేది? ముసలితనాన ఎంత కష్టం వచ్చిండాది మీకు?'
అక్కడ చేరిన ఆడవాళ్లు... మగవాళ్లు.. సాంబయ్య మంగమ్మ మీద తమకు తోచిన రీతిలో సానుభూతి వర్షం కురిపించారు. కొందరు మీనాక్షిని తిట్టిపోశారు. కానీ కొందరు మాత్రం మనసులోనే మంచిపనే చేసిందని మీనాక్షిని మెచ్చుకొన్నారు.
ఎవరి మాటలూ పట్టించుకోలేదు మంగమ్మ, సాంబయ్య. మౌనంగా లేచి, ఇంటికి వెళ్లిపోయారు.
**************************
ఆ రాత్రి నిద్రపట్టలేదు సాంబయ్యకు. రంగారెడ్డి అన్నట్లు సాంబయ్య వ్యవసాయ పనుల్లో దిట్ట. ఏ పంట వేసినా బంగారంలా పండాల్సిందే. అంత జాగ్రత్తగా చూసుకుంటాడు. కష్టపడతాడు.
ఒక్కగానొక్క కూతురు మీనాక్షిని అపురూపంగానే పెంచుకొన్నారు. మీనాక్షికి పెళ్లీడు వచ్చాక ఆమె అందం.. కష్టపడే తత్వం.. ఒద్దిక.. బంధువుల నుండి చుట్టుపక్కల పల్లెల్లో వరకూ చాలా సంబంధాలే వచ్చాయి. కానీ సాంబయ్యకు జగన్నాథం మీద మంచి అభిప్రాయం ఉండేది. అతనికి తల్లిదండ్రులు లేరు. ఒక్కడే కొడుకు. మేనత్త పెంచింది. తండ్రి ఆస్తిగా రెండెకరాల మాగాణి, మేనత్త ఆస్తి మూడెకరాల మెట్ట చేనుకు అతడే వారసుడు. ఒక్క దురలవాటూ లేదు. పైగా తనలా ఎప్పుడూ పొలం పనుల మీదే శ్రద్ధ. రైతుకు తనలాంటి రైతుబిడ్డ నచ్చడంలో వింతేమీ లేదు. అదీగాక కూతురు ఊర్లోనే.. తమ కళ్ల ముందే ఉంటుందన్న ఆశ కూడా తోడైంది. భార్య, కూతురుతో సంప్రదించాడు అభ్యంతరం చెప్పటానికేమీ కారణాలు లేవు. మీనాక్షి.. జగన్నాథానికి పెళ్లి జరిగిపోయింది. ఈడు, జోడు బాగున్నారని అందరూ మురిసిపోయారు. ఊర్లోనే అయినా కూతురు తమను విడిచి, అత్తగారి ఇంటికి వెళ్లేటప్పుడు చిన్నపిల్లాడిలా కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు సాంబయ్య.. ఎంతైనా కూతురు ఇంక పరాయి ఇంటిబిడ్డ అనుకుంటూ.
ఊర్లో అందరూ నవ్వుతూనే మందలించారు.. 'అదేందబ్బా! ఇప్పుడంతా పరాయి దేశాలకే అంపిస్తండారు బిడ్డల్ని. ఊర్లో ఇంటికి అంపించేదానికి ఏడ్చేదేలా? దినాము చూస్తానే ఉంటావు కదా!'.
'అయ్యో మామా! మీరు తనీగా ఉండేదేలా? మీరిద్దురూ గడా మా ఇంటికే వొచ్చేయండి. మీనాచ్చికే కాదు నాకు గడా అమ్మా అయ్యలు మీరే కదా! ఒంటి గాడినైపోతి! మా అత్త గడా చచ్చిపోయ! పెద్ద కుటుంబరం ఉండాలని నాకు చానా ఆశ ! అందుకే అంత పెద్ద ఇల్లు కట్టిన. మీరు గడా వొచ్చేయండి' అని జగన్నాథం బతిమాలాడాడు.
'మంచి అల్లుడే దొరికినాడు. మీకుండేది ఒకటే కూతురు. అల్లుడైనా.. కొడుకైనా.. జగనే కదా! ఇంగ అందరూ కలిసే ఉండండి' అని ఊర్లో వాళ్లు కూడా నచ్చజెప్పడంతో సాంబయ్య, మంగమ్మ ఒప్పుకున్నారు.
ఇంట్లో అమ్మా కూతుళ్లు, పొలం పనుల్లో మామా అల్లుళ్లు కష్టపడేవాళ్లు. మీనాక్షి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. వాళ్ల అల్లరి, ఆటపాటలతో ఇల్లంతా సందడి. మంగమ్మ, సాంబయ్య ఆనందానికి హద్దు లేకుండా పోయింది.
వాళ్ల సంతోషం చూసి విధికే కన్ను కుట్టినట్టుంది. నెమ్మది నెమ్మదిగా వాళ్ల జీవితాల్లోకి.. మనసుల్లోకి విచారం, దిగులు ప్రవేశించాయి. మనశ్శాంతి కరువైపోయింది. కూతురి జీవితం.. మనవల భవిష్యత్తు.. ఏమైపోతాయో అన్న ఆవేదన వారిని కుంగదీసింది.
మీనాక్షి తెలివైనదే కాదు ధైర్యవంతురాలు కూడా. ఇంటి పరిస్థితులు చక్కదిద్దడానికి తీవ్రంగా ఆలోచించింది. తల్లిదండ్రులతో సమాలోచనలు చేసింది. చివరికో నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయ ఫలితమే పంచాయితీ.
'ఏం నాయనా! ఇంకా పడుకోలేదా?'.
మీనాక్షి తల్లిదండ్రుల గదిలోకి వచ్చింది. పిల్లలు నిద్రపోయారు. జగన్నాథం పంచాయితీ నుండి అటే వెళ్లినవాడు ఇంకా ఇంటికి రాలేదు.
'జగన్ నిన్ను ఏమన్నా అంటాడేమో అని అమ్మ భయపడతాందిమా!' సాంబయ్య మాటలకు నవ్వుతూ వచ్చి, తల్లి మంచంపైన కూర్చుని.. ఆమె భుజంపైన చెయ్యివేసి ఆప్యాయంగా నొక్కింది.
'పిచ్చి అమ్మా! భయపడ్తాంటే భయపెట్టేది జాస్తీ అవతాదిమా! ఎదురుతిరిగితే భయపెట్టేవాల్లకే భయం పుడతాది. ఇప్పుడు భయం ఆయనకే మొదలైంది. ఇంగ నన్నేమంటాడూ?' మీనాక్షి ధీమాగా చెప్పింది.
'బంగారం లాంటి మడి.. ఆరుగాలం కష్టపడి పండించే మనిషి.. దూరమైనారంటే.. మనిషికి.. రేపెట్టా అన్న భయం పుట్టదా? పెండ్లాం బిడ్డల్ని సాకాల్సిన బాద్దెత గుర్తుకు రాదా? అప్పుడు గడా ఆ చీట్లాట ఆడేది, సారాయి తాగేది మానుకోడా? వాటి కోసరం.. ఇంతదాంకా పోగొట్టిన చేను.. చెలక.. గుర్తుకొచ్చి కడుపు మంట పెట్టదా? ఆయన తప్పకుండా మారతాడన్న నమ్మకం నాకు ఉండాదిమా! ఒగవేల.. మారలేదనుకో.. ఆయన కర్మ! నేను రైతు బిడ్డనే కదా! కష్టపడేది నాకు కొత్త కాదు. ఎవసాయం నేనే చేస్తా! నా బిడ్డలను సాక్కుంటా! మంచిగా చదివించుకుంటా! వాల్లు ఎగబడి వచ్చిందాకా కష్టపడితే సాలు. మల్ల వాళ్ల బతుకు వాళ్లు బతుకుతారు. ఈ బుద్ధి నాకు ఇంగా ముందే వచ్చుంటే బాగుండు. ఇప్పుడన్నా ఆయన మన మడి అమ్మతానంటే వచ్చింది. ఆ వరకూ ముందు నేను ఏమన్నా అడిగితే నీ అబ్బ సొమ్ము కాదు నాది అంటాండే కదా. మీరీడనే ఉంటే మీరు గడా ఏమీ అనలేరు కదా. అందుకే ఈ ఆలోచన చేసినా.
'అమ్మా! అయ్యా! పేరుకు మిమ్మల తనీగా ఉండమన్నా గానీ.. మిమ్మల్ని నేను చూసుకోపోతే ఎవరు చూసుకుంటారు అన్న బుద్ధి.. బువ్వ తినే నాకు లేదా? పల్లిలో ఎవరేమనుకున్నా నాకు లెక్క లేదు. మీరిద్దరూ నన్ను అర్థం చేసుకున్నారు. నాకంతే చాలు!'
మీనాక్షి మాటలకు దీవిస్తున్నట్లుగా ఆమె తలను తమ చేతులతో నిమురుతూ.. మనసారా చిరునవ్వు నవ్వారు ఆ ముసలి తల్లిదండ్రులు.
'నేను కూడా నిన్ను ఆశీర్వదిస్తున్నా' అన్నట్లుగా చందమామ కిటికీలో నుండి తన చల్లని వెన్నెల కిరణాల నవ్వుల్ని ప్రసరిస్తున్నాడు.
యం. ఆర్. అరుణ కుమారి 8121523835