Sep 22,2023 21:08

రెండో రోజు కొనసాగిన దళిత రక్షణ యాత్ర

ప్రజాశక్తి - నరసాపురం టౌన్‌
ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని మిగులు భూములను దళితులకు తక్షణం పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్‌ వి.శివనాగరాణి డిమాండ్‌ చేశారు. కెవిపిఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన దళిత రక్షణ యాత్ర రెండో రోజు నరసాపురం చేరుకుంది. అరుంధతిపేట, మండవారిపేట, చిట్టవరం, గొంది గ్రామాల మీదుగా సాగింది. ముఖ్య అతిథి శివనాగరాణి మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న సామాజిక, ఆర్థిక అసమానతలపై ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. బిజెపి పాలనలో వ్యవసాయ కార్మికుల జీవన పరిస్థితి దిగజారిందని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోందన్నారు. దళితులకు ఆర్థిక పునాది లేకే వారిపై వివక్ష కొనసాగుతోందన్నారు. మిగులు భూములను దళితులకు పంచాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బత్తుల విజయకుమార్‌, కె.క్రాంతి బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాతిరెడ్డి జార్జి, జక్కంశెట్టి సత్యనారాయణ, జిల్లా నాయకులు కౌరు పెద్దిరాజు, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి.చైతన్య ప్రసాద్‌, షేక్‌ వలీ, సిఐటియు జిల్లా నాయకులు ఎం.త్రిమూర్తులు, నాయకులు పొన్నాడ రాము, ఇజ్రాయేలు, నారాయణరావు, రాఘవులు, గుబ్బల నాగేశ్వరరావు, పోతు శ్రీను పాల్గొన్నారు.
భీమవరం రూరల్‌ : కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జెక్కంశెట్టి సత్యనారాయణ విమర్శించారు. దళిత రక్షణ యాత్ర బృందం వెంప పెదపేటకు శుక్రవారం చేరుకుంది. యాత్రకు ప్రజా సంఘాల నాయకులు స్వాగతం పలికారు. ముందుగా అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సభలో సత్యనారాయణ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ నీరు గారుస్తోందన్నారు. కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి కె.కాంతిబాబు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా దళితకాలనీలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అరుణ్‌, మండల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు మంద మార్తమ్మ, భూపతి శామ్యూల్‌,వి.పండు, ఇ.రమేష్‌ పాల్గొన్నారు.
యలమంచిలి : కేంద్ర ప్రభుత్వ మతోన్మాద విధానాలను నిరసిస్తూ ఈ నెల 29వ తేదీన విజయవాడలో చేపట్టనున్న మహా ధర్నాను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్‌ వి.శివనాగరాణి పిలుపునిచ్చారు. దళిత రక్షణ యాత్ర రెండో రోజు యలమంచిలి మండలంలో చించినాడ, మేడపాడు, యలమంచిలి గ్రామాల్లో సాగింది. చించినాడలో మహాధర్నా వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివనాగరాణి మాట్లాడుతూ మణిపూర్‌లో బిజెపి పాలనలో గిరిజన మహిళలను నగంగా ఊరేగించడం యావత్‌ భారతదేశం సిగ్గుపడాల్సి వచ్చిందన్నారు. ఇలాంటి ఘటనలు కనీసం పట్టించుకోని ప్రధాని మోడీ సిగ్గుపడాలన్నారు. 29న విజయవాడలో జరిగే మహాధర్నాకు ప్రజలందరూ తరలి రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా నాయకులు కానేటి బాలరాజు, నాయకులు మాచవరపు సుబ్బారావు, స్టాలిన్‌, ఎం.ఆంజనేయులు, ఏడుకొండలు, దేవ సుధాకర్‌, ఎం.కృష్ణ, జయశ్రీ, రాఘవులు పాల్గొన్నారు.
పాలకొల్లు : దేశంలో ఒకే మతం ఉండాలని తాము చెప్పినట్లు వినాలనే మోడీ ప్రభుత్వ విధానాలను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ విమర్శించారు. దళిత రక్షణ యాత్ర శుక్రవారం పాలకొల్లు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ యాత్రలో వ్యకాస నేతలు జక్కంశెట్టి వెంకటలక్ష్మి, సిపిఎం మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్‌, యర్రా అజరు, పురుషోత్తం పాల్గొన్నారు.
పెనుగొండ : దళితుల హక్కులు - సామాజిక న్యాయం కోసం వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌ ఐక్యంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపట్టినట్లు వ్యకాస జిల్లా కమిటీ సభ్యులు షేక్‌ పాదుషా అన్నారు. దళిత రక్షణ యాత్రలో భాగంగా శుక్రవారం పెనుగొండ బాపూజీపురంలో కరపత్రాలు పంపిణీ చేసి అనంతరం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 29న విజయవాడలో మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఉద్యమంలో దళిత, అంబేద్కర్‌ యువజన, కార్మిక, మహిళా సంఘాలు, వివిధ సంస్థలు, మేధావులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.