ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
ఎర్రకాలువ ప్రాజెక్ట్ మిగులు భూముల్లో అక్రమ విద్యుత్ కనెక్షన్‌లు తొలగించాలని సిపిఎం మండల కార్యదర్శి ఎం.జీవరత్నం డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఎపిఇపిడిసిఎల్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అధికారి అంబేద్కర్‌కు ప్రాజెక్ట్ మిగులు భూముల్లో అక్రమ విద్యుత్ కనెక్షన్‌లు తొలగించాలని కోరుతూ సిపిఎం మండల కమిటీ సభ్యులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జీవరత్నం మాట్లాడుతూ తాడువాయి, వేగవరం, చిన్నవారిగూడెం, ఎ.పోలవరం గ్రామాల్లో ఎర్రకాలువ ప్రాజెక్టు మిగులు భూముల్లో అక్రమ విద్యుత్ కనెక్షన్లతో మోటార్లు వేసి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. ఎర్రకాలువ ప్రాజెక్టు నిమిత్తం సేకరించిన భూముల్లో భూమిని దున్ని వ్యవసాయం చేయకూడదని చట్టం ఉన్నప్పటికీ భూస్వాములు అక్రమ సాగుకు తాడువాయి విద్యుత్ ఎఇ, లైన్‌మెన్ అండదండలతో అక్రమ విద్యుత్ కనెక్షన్లు పొంది సాగు చేస్తున్నారని తెలిపారు. అక్రమ కనెక్షన్లు తొలగించాలని పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు భూస్వాములకు వత్తాసుపలుకుతూ అక్రమ కనెక్షన్లు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. భూస్వాములు విద్యుత్ అధికారులకు ముడుపులు చెల్లిస్తున్నారని విమర్శించారు. పేద ప్రజలు ఎవరైనా ఒకనెల కరెంటు బిల్లు కట్టకపోతే కనెక్షన్ తొలగిస్తున్న అధికారులు 20 ఏళ్లుగా అక్రమంగా విద్యుత్ కనెక్షన్లతో నీరు తోడుతుంటే అధికారులు ఎందుకు స్పందిచడం లేదని ఆయన అధికారులను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు జి.సూర్యకిరణ్, అందుగుల ప్రభాకర్‌రావు, పార్టీ సభ్యులు పిల్లి చంటి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.










