ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
మాల, మాదిగలను విడదీయడానికి తెలంగాణలో మాదిగ విశ్వరూప మహాసభకు వస్తున్న ప్రధాని మోడీకి మిగిలిన ఉపకులాలు కనపడలేదా అని మాల మహానాడు రాయలసీమ అధ్యక్షులు రంగయ్య ప్రశ్నించారు. మోడీ పర్యటనను నిరసిస్తూ శనివారం మాల మహానాడు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించి కర్ణాటకలో కనివిని ఎరుగని రీతిలో జయకేతనం ఎగురవేసిన బాధను జీర్ణించుకోలేక తెలంగాణాలో మాదిగలపై కపట ప్రేమను ఒలకబోస్తున్నారని తెలిపారు. జెసి.నడ్డా, అమిత్ షా పదవులను మాదిగలకు ఇవ్వగలరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ, ప్రత్యేక హోదా గురించి లక్షల మంది రోడ్లపైకి వచ్చినా కనపడడం లేదని విమర్శించారు. ఓట్ల కోసం ఒక వర్గానికి కొమ్ము కాసి విడగొట్టాడనికి మాత్రం రాష్ట్రానికి వస్తారని దుయ్యబట్టారు. అనంతరం వైఎస్‌ఆర్ సర్కిల్ నుంచి సోమప్ప కూడలి మీదుగా అంబేద్కర్‌కు వినతి పత్రం ఇచ్చి సోమప్ప సర్కిల్‌లో ధర్నా చేశారు. మాలమహానాడు నాయకులు రాజోలప్ప, పరమేష్, మునెప్ప, నరసింహులు, గోపాల్, ముని, వెంకటేష్, ఉరుకుందు, బాలు, తుకారాం, కొత్తూరు వీరేష్, హుస్సేని, నరసింహులు, పెద్దయ్య, వీరలింగ పాల్గొన్నారు.
నిరసన తెలియజేస్తున్న మాలమహానాడు నాయకులు