Dec 17,2022 22:56

ప్రజాశక్తి - పెనమలూరు : యనమలకుదురు సమీపంలో కృష్ణానదిలో శుకవ్రారం గల్లంతయిన వారిలో మిగిలిన విద్యార్థుల ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. విద్యార్థులు ఈత కొట్టేందుకు దిగిన ప్రదేశానికి కొద్దిదూరంలోనే శనివారం మృతదేహాలు లభ్యమయ్యాయి. ఐదుగురు విద్యార్థులు గల్లంతుకాగా, వీరిలో ఇద్దరు తోట కామేష్‌ (15), ఇనకోట్ల గుణశేఖర్‌ (మున్నా) (14) మృతదేహాలు శుక్రవారంనాడే వెలికితీసిన సంగతి తెలిసిందే. మిగిలిన మదాల బాలు (17), షేక్‌ బాజీ (15), దూదేకుల హుస్సేన్‌ (15) ఆచూకీ లభించకపోవడంతో శనివారం గజయీతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈతకు దిగిన ప్రాంతంలోనే మిగిలిన ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువకులు ఈతకు దిగిన ప్రాంతం గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోనిది కావడంతో పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి తాడేపల్లి పోలీసులకు అప్పగించారు.
సిపిఎం, కెవిపిఎస్‌ నేతల పరామర్శ
కృష్ణా నదిలో ఈతకు దిగి ప్రమాదవశాత్తూ మరణించిన విద్యార్థులకు కుటుంబాలకు ప్రభుత్వం రూ.20 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని సిపిఎం నాయకులు షేక్‌ ఖాసీం, సిఐటియు పెనమలూరు మండల కార్యదర్శి ఉప్పాడ త్రిమూర్తులు డిమాండ్‌ చేశారు. మృతదేహాలు లభ్యమైన సమాచారాన్ని తెలుసుకుని నది వద్దకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరణించిన వారితల్లిదండ్రులు రోజూవారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారన్నారు. అలాంటి వారికి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కెవిపిఎస్‌ ఎన్‌టిఆర్‌ జిల్లా అధ్యక్షులు గుండిమెడ క్రాంతి కుమార్‌, తూర్పు సిటీ అధ్యక్షులు ఎన్‌.శ్యాంబాబు తదితరులు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాలను సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, పక్కా ఇళ్లు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
విద్యార్థుల మృతదేహాలను గాలించి వెలికి తీసిన మత్స్యకారులు
కృష్ణానదిలో గల్లంతైన వారి మృతదేహాలను పటమట ప్రజా మత్స్యకార సహకార సంఘం ఇ-65కు చెందిన సొసైటీ అధ్యక్షులు, జిల్లా డైరెక్టర్‌ నడకుదిటి కాళితోపాటు నడకుదిటి శ్రీనివాస్‌, పీతా కొండలరావు, బొడ్డు మీరా సాహెబ్‌, భాస్కరరావు (తాడి) నాలుగు పడవల సాయంతో శుక్ర, శనివారాలు గాలించి వెలికితీశారు.