Mar 28,2023 00:16

సమావేశంలో మాట్లాడుతున్న మంగశ్రీ

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : అక్షయపాత్ర నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ (సిఐటియు) విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు పి.మణి డిమాండ్‌ చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, అక్షయపాత్రను రద్దు చేయాలని ఏప్రిల్‌ 5వ తేదీన చలో ఢిల్లీని జయప్రదం చేయాలని యూనియన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యాన సోమవారం జగదాంబ సమీపంలోని సిఐటియు కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. సదస్సుకు యూనియన్‌ జిల్లా నాయకులు జి.మంగశ్రీ, భవానీ, పి.రమణమ్మ, వెంకీయమ్మ, వెంకటలక్ష్మి, కన్నతల్లి, గౌరి అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. సదస్సులో ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధులకు రాగిజావ వండి, సరఫరా చేయమని ఇచ్చిన ఆదేశాలను అక్షయపాత్ర సంస్థవారు అమలు చేయటం లేదన్నారు. అక్షయపాత్ర వున్న చోట మధ్యాహ్న భోజన పథకం కార్మికులే రాగిజావ వండుతున్నారని తెలిపారు. ప్రభుత్వం పాత్రలు, గ్యాస్‌ సరఫరా కూడా చేయకుండా రాగిజావను వండించడం సరికాదన్నారు. జగనన్న గోరుముద్ద క్రింద ఇచ్చిన మెనూ చార్జీలు పెంచాలని కోరారు. పాఠశాలలో నియమించిన పారిశుధ్య కార్మికులకు రూ.6 వేలు, వాచ్‌మ్యాన్‌లకు రూ.6 వేలు వేతనం ప్రకటించారని, వాలంటీర్లలకు రూ.5 వేలు ఇస్తున్నారని తెలిపారు. విద్యార్ధులకు వేడివేడిగా వండిపెట్టే కార్మికులకు మాత్రం రూ.3 వేలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గ్యాస్‌ ధర విపరీతంగా పెరగడం, సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపధ్యంలో మెనూ చార్జీలు పెంచాలని, గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని, నాణ్యమైన గుడ్లు సరఫరా చేయాలని డిమాండ్‌చేశారు. శనివారం రాగిజావ, చక్కెర పొంగలి, పప్పుచారు, ఆకుకూర ఆన్నంగా ఉన్న మెనూ మార్చి పని భారం తగ్గించాలని కోరారు. కనీసవేతనం రూ.26 వేలు అమలు చేయాలని, స్కీమ్‌ వర్కర్లను పర్మినెంట్‌ చేయాలని, కనీస పెన్షన్‌ రూ.10వేలు ఇవ్వాలని కోరుతూ ఏప్రిల్‌ 5న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమానికి కార్మికులంతా బయలుదేరాలని పిలుపునిచ్చారు.