మిడ్డేమీల్స్ కార్మికుల పెండింగ్ వేతనాలకు ఎమ్మెల్సీకి వినతి
ప్రజాశక్తి-చింతూరు
తమకు రావాల్సిన పెండింగ్ వేతనాలు చెల్లించే విధంగా అధికారులపై ఒత్తిడి తేవాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీకి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. చింతూరు మండలంలోని పలు పాఠశాలను శుక్రవారం ఎమ్మెల్సీ సాబ్జీ సందర్శించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులు ఎమ్మెల్సీని కలిసి సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి పి.వెంకట్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై సంవత్సర కాలం కావస్తున్నా మిడ్డేమీల్స్ కార్మికులకు వేతనాలు, బిల్లులు ఇవ్వలేదని తెలిపారు. దీంతో కిరాణా షాపుల్లో అప్పులు చేసి మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నారని పేర్కొన్నారు. నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థికంగా మానసికంగా అనేక ఇబ్బందులకు గురవు తున్నారన్నారు. ప్రభుత్వం నుండి రావలసిన పెండింగ్ బిల్లులు తక్షణమే అందజేసేలా ఒత్తిడి తీసుకురావాలని కోరారు. దీనికి ఎమ్మెల్సీ సాబ్జీ సానుకూలంగా స్పందించి అధికారులతో మాట్లాడి బిల్లులు వెంటనే చెల్లించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మిడ్డే మీల్స్ కార్మికులు భవాని తదితరులు పాల్గొన్నారు.










