సిఐటియు మండల కార్యదర్శి పెంటయ్య
ప్రజాశక్తి- కూనవరం
అంగన్‌వాడీ కేంద్రాలకు, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పాఠశాలలకు బియ్యం సరఫరా చేయాలని సిఐటియు మండల కార్యదర్శి కొమరం పెంటయ్య డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు, ప్రభుత్వ పాఠశాలలకు బియ్యాన్ని వాహనాల ద్వారా సచివాలయాల తరుపున అందిస్తామని గొప్పగా ప్రకటించిన ప్రభుత్వం, ఒక నెల మాత్రమే అందించి చేతులెత్తేసిందని విమర్శించారు. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు, మిడ్డేమీల్స్ వర్కర్లను చౌక దుకాణాల నుండి బియ్యం తీసుకెళ్లాలని చెప్పటం భావ్యం కాదన్నారు. డ్రైవర్లకు మూడు నెలలుగా జీతాలు రాని కారణంగా ఈ రెండు రంగాలకు బియ్యం పంపిణీ చేయలేమని వారు చెప్పినట్లు డీలర్ తెలిపారన్నారు. ఇప్పుడు మేము బియ్యం తరలించుకోవటానికి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. మిడ్డేమీల్స్, అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు తాళ్లూరి శ్రీనివాసరావు, నాయకులు కొండ ఈశ్వర్లు, పసుపులేటి ఏడుకొండలు, మిడ్డేమీల్స్ వర్కర్స్ అండ్ యూనియన్ నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.










