ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్ మున్సిపల్ స్కూల్స్‌లో 25 ఏళ్లుగా పని చేస్తున్న కంటింజెంట్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని పలు సమస్యలపై మిడ్డే మీల్స్ వర్కర్లతో కలిసి సోమవారం ధర్నా చేశారు. బొమ్మూరులోని కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నానుద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, ఎండిఎం జిల్లా అధ్యక్షులు చింతా బేబీ, మున్సిపల్ స్కూల్స్ పార్ట్ టైమ్ కంటింజెంట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వై.జాన్సీ మాట్లాడారు. పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని, కనీస వేతనం రూ.16,000 చెల్లించాలని, బాత్రూంలో ఫోటో తీసి ఆన్‌లైన్ అప్లోడ్ చేసే విధానాన్ని రద్దు చేయాలని, మధ్యాహ్న భోజనానికి వంట సామాగ్రి, గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని, స్వచ్ఛంద సంస్థలకు మధ్యాహ్న భోజనాన్ని అప్పగించరాదని, ధరలు కనుగుణంగా వంటలమ్మలకు రూ.10,000 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఆయల యూనియన్ నాయకులు మంగతాయారు, సత్యవతి, మధ్యాహ్న భోజన పథక కార్మికుల సంఘం జిల్లా నాయకులు నాగమణి, పాల్గొన్నారు.










