
హీరో బర్త్‌డేలంటే అభిమానుల హడావిడి అంతా ఇంతా కాదు. భారీ కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేయడం.. కేజీల కొద్దీ కేక్‌లు కట్ చేయడం.. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం... సంబరాలు అన్నీ ఇన్నీ కావు. ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసే హంగామా ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. కాగా మరో మూడు రోజుల్లో సూపర్‌స్టార్ మహేష్‌బాబు బర్త్‌డే (ఆగస్టు 9) రానుంది. ఈ సందర్భంగా మహేష్‌బాబు అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశాడు. అదేమిటంటే.. తన పుట్టినరోజున ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని కోరుతున్నాడు.
ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్‌లో 'నాపై ప్రేమాభిమానాలతో మీరు చేసే పనులు నన్నెంతగానో ప్రేరేపిస్తున్నాయి. అయితే ఈసారి నాదొక విన్నపం. నా పుట్టినరోజున ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మద్దతుగా నిలబడండి. మొక్కలు నాటుతూ దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేయండి. వాటిని నేను కూడా చూస్తాను' అని పేర్కొన్నారు. సూపర్‌స్టార్ తీసుకున్న ఈ నిర్ణయానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఎంత గొప్ప మనసంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.