విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం మరో ఘట్టానికి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున కార్మికులు 2, 3 తేదీలలో రెండు రోజుల ధర్నా పట్టుదలగా నిర్వహించారు. వర్షానికి కూడా వెరువక ధర్నాలో పాల్గొన్న వారందరి కృషిని రాష్ట్రాభివృద్ధి కోరుకునే వారంతా హర్షిస్తున్నారు.
శ్రమకోర్చి 2000 కిమీ దూరం ప్రయాణించిన ఈ కార్మికుల పట్ల మోడీ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు అత్యంత ఆక్షేపణీయం. రైళ్లలో దిగిన వారిని పోలీసులు అడ్డగించడం, లాడ్జిలలో రూములు కేటాయించనివ్వకపోవడం, రిజర్వ్ చేసుకున్న రూములను కూడా రద్దు చేసేటట్లు హోటల్ యాజమాన్యాలపై పోలీసులు వత్తిడి తేవడం వంటివన్నీ ఈ ఉద్యమాన్ని అణచివేయాలనే దుర్బుద్ధితో మోడీ ప్రభుత్వం చేసినవేనని స్పష్టమవుతోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలు లేకుండా ఢిల్లీ పోలీసులు ఇటువంటి నిర్బంధ చర్యలకు పాల్పడతారని అనుకోలేం. అదే సందర్భంలో అన్ని అవాంతరాలను అధిగమించి తమ తీవ్ర నిరసనకు వ్యక్తం చేయడానికి కారణం కార్మికుల పట్టుదలే. ఇప్పుడిక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అదేమిటంటే అంతిమంగా మోడీ నిరంకుశత్వం, కార్మికుల పట్టుదలలో ఏది విజయం సాధిస్తుందని.
దీనికి సరైన సమాధానం రావాలంటే ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా వేసుకోవాలి. పార్లమెంటులో మెజారిటీతో తాను అనుకున్న అన్ని పనులను చేసి తీరగలమని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్మికులు శాంతియుతంగా నిరసన తెలపడానికి రాజధానికి వస్తే, ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంగా వారికి సౌకర్యాలు కల్పించవలసింది పోయి, నిర్బంధానికి ఎందుకు పాల్పడిందన్నది. అయినా పట్టు సడలకుండా కార్మికులు తాము అనుకున్న ధర్నాను ఎలా జయప్రదం చేశారన్నది. ఇక్కడే అసలు రహస్యమంతా ఉంది. తన అమ్మకాల విధానమంతా సరైనదేనని ప్రజలు భావిస్తున్నారనే అభిప్రాయం ప్రభుత్వానికి వుండి వుంటే, ఇటువంటి నిర్బంధానికి పాల్పడి ఉండేది కాదు. ఎందుకంటే, అప్పుడు ప్రజలు కార్మికులనే దోషులుగా చూసేవారు. కానీ ప్రభుత్వానికి కూడా ఒక విషయం తెలుసు. ఈ కార్మికులను స్వేచ్ఛగా వదిలేస్తే, పోరాటం తీవ్రమై, తన కార్పొరేట్ అనుకూల బండారం ప్రజల ముందు బహిర్గత మవుతుందని. అందువల్ల ఈ నిర్భందం ప్రభుత్వ బలహీనత నుంచి వచ్చిందే కానీ, బలం నుండి మాత్రం కాదు. అదే సమయంలో కార్మికులు కూడా పిరికితనంతో పారిపోవడం కాకుండా పట్టుదలతో ధర్నాలో పాల్గొనడం వారి సంకల్పం నుండి వచ్చినదే కానీ ఎవరో రెచ్చగొడితే వచ్చినది కానే కాదు. ఇక్కడ ప్రభుత్వ బలహీనత, కార్మికుల సంకల్పం ఏకకాలంలో దర్శనమిస్తున్నాయి. కార్మికులు ముందే ప్రకటించి ఉద్యమానికి సన్నద్ధమయితే, ప్రభుత్వం మాత్రం పోలీసులతో చిల్లర చిట్కాలకు పాల్పడింది.
ఢిల్లీ ధర్నాలో వివిధ పార్టీల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. రాష్ట్రంలోని అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీల పార్లమెంటు సభ్యులు ఉద్యమానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సిపిఎం, సిపిఐ, ఎల్‌జెపి, రైతు సంఘాలు, ఐద్వా, వివిధ కార్మిక సంఘాలు సంఘీభావం తెలపడమే కాక, పార్లమెంటు లోపల, బయట కూడా కలసి పోరాడతామని ప్రకటించాయి.
ఢిల్లీ ధర్నాకు సంఘీభావంగా విశాఖ నగరంలో అపూర్వమైన మరో ధర్నా జరిగింది. ఇప్పటికే నగర కార్పొరేషన్ ఈ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేసింది. తీర్మానంతోనే సరిపెట్టకుండా రెండవ తేదీన నగర మేయరు నాయకత్వంలో కార్పొరేటర్లందరూ జివిఎంసి కార్యాలయం వద్ద ధర్నా చేయాలని ఫ్లోర్ లీడర్ల సమావేశంలో నిర్ణయం చేశారు. దీనికి అనుగుణంగానే వైసిపి, సిపిఐ, సిపిఎం కార్పొరేటర్లు ధర్నాకు హాజరై పూర్తి సమయమంతా పాల్గొన్నారు. కానీ విచిత్రంగా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు దీనికి గైర్‌హాజరయ్యారు. కారణమడిగితే తమ నాయకుని ఆదేశమని తెలిపారు. కారణం ఏమయినా ఇది దురదృష్టకరం. ఇటీవలి మునిసిపల్ ఎన్నికలలో రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీచినా విశాఖ నగరంలో మాత్రం మొత్తం 98 మందికి గాను 30 మంది తెలుగు దేశం కార్పొరేటర్లు గెలిచారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు అధికంగా ఉన్న ప్రాంతం నుండి వీరు ఎక్కువగా గెలిచారు. మొత్తం 20 లక్షల మందికి పైగా నగర ప్రజల ఐక్యతను చాటి, ఉద్యమానికి ఊపునిచ్చే ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడం ప్రజాభీష్టానికి అనుగుణం కాదు. రాజకీయంగా పైచేయి సాధించాలనుకున్నా, ఇతరుల కంటే బాగా చేయాలి కానీ, ఇలా ఉమ్మడి ఉద్యమాన్ని బలహీన పరచడం సరికాదు. జనసేన పార్టీ కూడా దూరంగా ఉండడంతో...'జనసేనాని జనంతోనా/ మోడీ తోనా? ప్రజల పక్షమా/ కార్పొరేట్ల పక్షమా?' అనే ప్రశ్న ప్రజలలో కలుగుతోంది. పరీక్షా సమయాలలోనే ఎవరిదైనా అసలు స్వభావం బయట పడుతుందంటారు. ప్రజలు కూడా ఇలాంటి సమయాలలోనే అందరిని గమనిస్తుంటారు. మాటలకు, చేతలకు ఉండే వ్యత్యాసం కూడా ఇలాంటప్పుడే బహిర్గతమయ్యేది.
ఢిల్లీ వెళ్ళే దారిలో అనేక రైల్వే స్టేషన్లలో తెలంగాణ కార్మికులు స్టీల్ కార్మికులకు సంఘీబావం తెలిపారు. తెలుగు ప్రజలు పొరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ ను అమ్మితే సహించేది లేదనే నినాదాలతో రైల్వే స్టేషన్లన్నీ మార్మోగిపోయాయి. వీరికి ప్రయాణ సమయంలో కావలసిన అన్ని ఆహార పదార్ధాలను వారే స్వయంగా వండి సరఫరా చేశారు. ఈ అపూర్వ ఆదరణ పోరాడుతున్న కార్మికులకు నూతన ఉత్తేజాన్నిచ్చింది.
కార్మికులు, తెలుగు ప్రజలు ఇంతగా వ్యతిరేకిస్తున్నా, ఈ నిర్ణయంపై వెనక్కు తగ్గేది లేదని, అప్పుడే అమ్మకానికి ఏర్పాట్లన్నీ చేసేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ధర్నా రోజే పార్లమెంటులో నిస్సిగ్గుగా ప్రకటించింది. ఒక పక్క ఆత్మ నిర్భర్ నినాదమిస్తూ, మరోపక్క దేశ స్వావలంబనకు విశేషంగా దోహదపడుతున్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్మి దేశ, విదేశీ కార్పొరేట్ల పరం చేయడం ఏ రకమైన దేశభక్తో వారికే తెలియాలి. ప్రభుత్వం మొండిగా ఉంది కదా, మనం ఏం చేసినా ఇంకేం లాభం అని ఎవరికైనా సందేహం రావచ్చు. కార్పొరేట్లకు దాసోహమై, దేశ సంపదను వారికి దోచి పెడుతూ, తామేదో ఘనకార్యం చేసేస్తున్నట్లు పోజులు పెడుతున్న మోడీ అండ్ కో నుండి అంత వేగంగా మార్పు వస్తుందని భావిస్తే అది మన అమాయకత్వమే. దీనికి సమాధానం ఇంకా పట్టుదలతో, ప్రజల మద్దతు కూడగట్టి ఉద్యమించడమే. ఇంతకంటే మొండిగా ఉన్న ప్రభుత్వాన్నే మెడలు వంచి సాధించుకున్న ప్లాంటిది. వీరిని ఎదుర్కోవడానికీ అదే మార్గం. అప్పటి మహోద్యమంతో పోలిస్తే ఇప్పుడే అసలు కథ ప్రారంభమయింది. తాడో పేడో తేల్చుకోవాల్సిందే.
పోరాడేవారే చరిత్రలో హీరోలవుతారు. ద్రోహం చేసిన వారు, దేశాన్ని అమ్మేసేవారు ఎప్పుడూ ద్రోహులు గానే మిగులుతారు. కార్మికులు మాత్రం దేశ ప్రయోజనాల కోసం, ఎలాగైనా ప్లాంటును కాపాడుకుంటామనే కృతనిశ్చయంతో పోరాడడానికి సన్నద్ధంగా ఉన్నారు. వీరికి అండగా ఉండడం, రోడ్లపైకొచ్చి పోరాడడం రాష్ట్ర రాజకీయ పార్టీల విధి. అనేక పోరాట రూపాలను ఇంకా రూపొందించుకోవలసి ఉంది. దేశ సంపదను కాపాడుకుంటామనే సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగడమే ఏకైక మార్గం.
ఎ. అజ శర్మ / వ్యాసకర్త ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి /










