ప్రజాశక్తి-బాపట్ల: మానవ జాతి చరిత్ర అతీత శక్తులు పుణ్యపురుషుల సృష్టిగా ఘోషిస్తుంటే మానవుడే చరిత్ర నిర్మాత అన్న మహౌన్నత వ్యక్తి కారల్ మార్క్స్ అని బాపట్ల జిల్లా సిపిఎం కమిటీ సభ్యులు టి కృష్ణమోహన్ అన్నారు. మంగళవారం కార్ల్ మార్క్స్ వర్థంతి సందర్భంగా సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సిపిఎం నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రకృతిని బానిసగా చేసుకొని మానవ చరిత్రను తానే నిర్మించాడని మార్క్స్ ఉద్బోధిం చాడని అన్నారు. కారల్ మార్క్స్ మరణించి 140 ఏళ్లయినా ఆయన సిద్ధాంతం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉందని అన్నారు. ఆయన చూపిన మార్గంలో కోట్లాది మంది పయనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. సిపిఎం సీనియర్ నాయకులు నూతలపాటి కోటేశ్వరరావు మాట్లాడుతూ శ్రమశక్తి దోపిడీకి వ్యతిరేకంగా కార్మికవర్గం ఉధృతమైన పోరాటాలను ప్రారంభించి పనిగంటల తగ్గింపుతోపాటు జీవనానికి సరిపడే వేతనం, మెరుగైన పని పరిస్థితులు, ప్రజాస్వామిక హక్కుల కోసం కార్మిక సంఘాలు పెట్టుబడిదారీ, భూస్వామ్య ప్రభుత్వాలపై తిరుగుబాటుకు కార్ల్ మార్క్స్ ప్రేరణ కలిగించారన్నారు. 17 ఏళ్ల ప్రాయంలోనే పాఠశాల చదువు ముగించిన మార్క్స్ ప్రాచీన సాహిత్యంలోనూ, జర్మన్‌భాషలోనూ, చరిత్ర పాఠాల్లోనూ అత్యంత ప్రతిభ కనబరిచారు. ప్రపంచ కార్మికులారా ఏకంకండి, పోరాడితే పోయేదేమీలేదు బానిస సంకెళ్ళు తప్ప అనే పిలుపుతో కమ్యూనిస్టు ప్రణాళికను ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. అదే సూత్రం ప్రపంచ కార్మికవర్గానికి వెలుగుబాట చూపిందన్నారు. జర్మనీలో పుట్టిన ఆయన యూరప్‌లోని అనేక దేశాల నుంచి బహిష్కరణకు గురై 1849 నుంచి లండన్‌లో ప్రవాసిగా జీవితం గడుపుతూ అక్కడే మరణించారన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి మజుందార్, నాయకులు జంగం సామేల్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఏ ఆర్య పాల్గొన్నారు.










