
'కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ.. కొడవళ్లు చేపట్టవే చెల్లెమ్మ..' అంటూ సేద్యం చేయడమే కాదు.. ట్రాక్టర్లు సైతం నడుపుతూ రైతు గణతంత్రలో పాల్గొని, మహోద్యమంలో మేము సైతం అంటూ.. దేశ రాజధానిలో మహిళా రైతులూ తమ ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. రైతు అనగానే వెంటనే పురుషుడినే ముందుకుతెస్తారు. చిత్రంగా చిత్రం కూడా అతనిదే వేస్తారు. వాస్తవానికి వ్యవసాయంలో మూడొంతులు శ్రమ ఆమెదే.. ఇంకా చెప్పాలంటే.. పంట పండించే దగ్గర నుండి.. అన్నం వడ్డించే వరకూ ఆమె 81 శాతం భాగస్వామ్యమై ఉంది. అందుకే ఆమె పాత్ర అద్వితీయం.. అపూర్వం. అంతటితో సరిపెట్టక మూడు నల్లచట్టాలపైనా రైతక్కలు నినదిస్తున్నారు. ఢిల్లీ రాజధాని మహోద్యమంలో తమ మాటా, పాటా, అడుగులతో గళం ఎత్తారు. పంటల పండగ సంక్రాంతినీ ఉద్యమంగా మార్చారు. భోగి మంటల్లో చట్టాలను తగలేశారు. వారి ధిక్కార స్వరం మిన్నలలో ప్రతిధ్వని స్తోంది. పొలాలు, అడవులు, చెట్టూ చేమా, తాము చెమటోడ్చి పండించిన ధాన్యపు కంకుల సాక్షిగా దళిత బహుజన, ఆదివాసీ, ట్రాన్స్‌జండర్ బహుళత్వాలతో అనేక రాష్ట్రాల్లో మారుమోగుతున్న ఈ రైతమ్మల గురించే ఈ ప్రత్యేక కథనం.
దళిత హక్కులు..
భూమిలేని కూలీల్లో దళితులు ఎప్పుడూ ఉంటారు. వీళ్లు భూస్వాముల నుండి లైంగిక వేధింపులతో పాటు, కుల వివక్షనూ ఎదుర్కొంటున్నారు. కొన్నేళ్లుగా పంజాబ్ ఖేత్ మజ్దూర్ యూనియన్, జమిన్ ప్రప్తి సంఘర్ష్ సమితి సంయుక్తంగా దళిత భూ హక్కుల కోసం పనిచేస్తున్నాయి. ఈ సంస్థలు అత్యధిక మహిళా సభ్యత్వం కలిగి ఉన్నాయి. వీళ్లు ఉద్యమంలో ముందుండి పనిచేస్తున్నారు. ''మేము తరతరాలుగా కులవివక్షను ఎదుర్కొన్నాం. కానీ ఇప్పుడు అందరికీ సమస్య వచ్చింది. అందుకే అందరం కలిసి పోరాడదాం రండి!'' అని తారావంతి (70) ముక్త్సర్ జిల్లాకు చెందిన దళితురాలు కోరుతున్నారు. పంజాబ్ యూనివర్శిటీ యువతులు, చాలామంది రైతు కుటుంబాల నుండి వచ్చినవారు చురుకుగా పాల్గొంటున్నారు. ''అమ్మాయిలు ఎంతో ఇష్టపడే, కలలు కనే విద్య ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. ఈ చట్టాల వల్ల వ్యవసాయ ఆదాయం తగ్గడంతో తిరిగి ఇంటికే పరిమితం కావాల్సి వస్తుంది'' అని ఫరీద్‌కోట్ జిల్లాలోని ప్రభుత్వ బ్రిజింద్ర కళాశాలలో ఆర్థికశాస్త్రం రెండో సంవత్సరం మాస్టర్స్ చేస్తున్న విద్యార్థిని సుఖ్‌ప్రీత్ కౌర్ చెప్తున్నారు. ఆ కుటుంబం ఎంత శ్రమించినా ఆమెను విశ్వవిద్యాలయంలో ఉంచడం కష్టమవుతుంది. కొత్త చట్టాలపై స్టే, నిరసనకారులతో మాట్లాడేందుకు వేసిన కమిటీ వీసమెత్తు కూడా సమస్యను పరిష్కరించదు. ''సుప్రీంకోర్టు కమిటీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. మహిళా రైతులు, నేను చెప్పాలనుకుంటుంది ఈ చట్టాలు పూర్తిగా రద్దయ్యే వరకూ మేము ఇక్కడి నుంచి తిరిగి వెళ్లము'' అని హరీందర్ కౌర్ బిందు గట్టిగా చెప్తున్నారు.
అక్టోబర్ నుండే అవగాహన..
అక్టోబర్ నుండే పంజాబ్‌లోని గ్రామాలు, పట్టణాల్లో ప్రజల్ని కుల, వర్గ భేదం లేకుండా నల్లచట్టాలకు వ్యతిరేకంగా సమీకరిస్తున్నారు. దీనికి ఏక్తా ఉగ్రవాన్ రైతుసంఘం ప్రధానకార్యదర్శి హరీందర్ కౌర్ బిందు నేతృత్వం వహించారు. కార్పొరేట్లకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు వ్యవసాయంలో మహిళలు ఎక్కువగా ఉండే గ్రామాలు, మార్కెట్ ప్రాంతాలు, గురుద్వారాస్‌లో .. అదానీ, అంబానీ సమూహాలు, రిలయన్స్ నడిపే పెట్రోల్ పంపులు, వేదాంత థర్మల్ ప్లాంట్, మాల్స్, గిడ్డంగులు తదితరాల వద్ద మహిళలు పిట్ ప్రదర్శించి, సంతాప గీతాలు ఆలపించారు. అక్టోబర్ నుండి మంజీత్ కౌర్ (40), చరణ్జీత్ కౌర్ (39) ప్రతిరోజూ ట్రాక్టర్‌పై వెళ్లి, ఫరీద్‌కోట్ జిల్లాలోని వారభైకా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పంజాబ్ నుండి 4.4 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీడా టోల్ ప్లాజా వరకూ వెళ్లి చట్టాల గురించి, ఆందోళన ప్రాధాన్యత గురించి ఈ కొద్ది నెలల్లో ప్రజలకు అవగాహన కల్పించారు.
ఇంటి బాధ్యతలు నెరవేరుస్తూ, దీనికి సంబంధించిన ప్రతిదానిపై మాన్సా జిల్లాలో కిరంజీత్ కౌర్ (25) కిసాన్ మజ్దూర్ ఖుడ్కుషి పీడిట్ పరివార్ కమిటీని నడుపుతున్నారు. ఇటీవల వరసుగా 92 రోజుల పాటు ప్రచారం నిర్వహించారు. నవంబర్ 1వ తేదీ నుండి జనవరి 31వ తేదీ వరకూ ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను కలిసి, ఆ మహిళలకు తీవ్రతరమవుతున్న వ్యవసాయ సంక్షోభాన్ని, పెరుగుతున్న అప్పుల గురించి వివరించి, ఈ ఆందోళనలో ఎందుకు భాగస్వాములు కావాలో అవగాహన కల్పిస్తున్నారు.
అప్రజాస్వామ్యంపై ధిక్కార స్వరం..

వ్యవసాయంలో తమదైన స్వతంత్ర గుర్తింపు, హక్కుల కోసం దేశవ్యాపితంగా మహిళలు సంఘటితమవుతున్నారు. వ్యవసాయంలో దాదాపు అత్యధిóక శాతంగా ఉన్న మహిళా రైతులు, కూలీలు కేంద్రం ఏ రకమైన చర్చా లేకుండా తీసుకొచ్చిన ఈ మూడు నల్లచట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓ పక్క సేద్యపు బాధ్యతను మోస్తూనే వివిధ పద్ధతుల్లో తమకు వీలైన సమయాల్లో ప్రత్యక్షంగా ఉద్యమంలోనూ పాల్గొంటున్నారు. గడ్డ కట్టించే ఢిల్లీ చలిని సైతం లెక్కచేయక శాంతియుతంగా తమ నిరసన తెలియజేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజు అన్ని రాష్ట్రాల నుంచీ ఢిల్లీలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీలోనూ పాల్గొని, తమ ధిక్కార స్వరం వినిపించారు. వీరి పోరాట పటిమను అవహేళన చేస్తూ 'ఈ ఆందోళనలో మహిళలు, వృద్ధులు ఎందుకు? వారిని ఇంటికి వెళ్లమని చెప్పండి!' అంటూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పితృస్వామ్య దృక్పథంతో చేసిన ఆదేశమేనని తిప్పికొట్టారు.
'ఆడపిల్లలు ఇంట్లోనే ఉండాలి! అసలు బయటకు రావాల్సిన అవసరం ఏమిటి? ఆ సమయంలో ఎందుకు?' అనే మాటలు ఎంత మూర్ఖత్వంతో కూడుకున్నవో.. ''స్త్రీలు, వృద్ధులు ఈ నిరసనలో ఉండనవసరం లేదు. వాళ్ళని ఇళ్లకు వెళ్ళమని చెప్పండి'' అన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలకూ తేడా కనిపించడం లేదు. పైకి కనిపించటానికి ఒక మానవతా దృక్పథంతో మహిళలు కష్టపడకూడదు అనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోన్నా, ఆ ఆదేశాల అంతరార్థం మాత్రం మహిళల నిర్ణయాత్మక దృక్పథాన్ని అణిచివేయడమే. ఇంకో ముఖ్యమైన అంశం ఏమంటే, మహిళలు లేకుంటే ఎలాంటి హింసాత్మకమైన పద్ధతులను ఉపయోగించైనా సరే ఉద్యమాన్ని అణిచివేయాలనుకునే ప్రభుత్వ ఆలోచనకు ఊతమివ్వటమే.
''మహిళలకు నిరసన తెలిపే హక్కు ఉందని వారికి తెలియదా? ఇలాంటి ఆదేశాలు వాళ్లు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కుని కాలరాయటం కాదా!?'' అని వాళ్లు ప్రశ్నించడమే కాదు.. ''నిరసనలలో పాల్గొనడం మాకేమీ అసౌకర్యం కాదు.. ఇప్పుడు కాదు ఎప్పటి నుండో ఉద్యమంలో అంతర్భాగంగా ఉన్నాం. పంజాబ్‌లో గ్రామాలు, పట్టణాలలో కులం, వర్గం పక్కనపెట్టి ప్రజలను సమీకరించడంలో గత జులై ఒకటవ తేదీ నుండే మేమే చురుకుగా పాల్గొన్నాం'' అంటూ అతిపెద్ద రైతు సంఘం ఏక్తా ఉగ్రహాన్ ప్రధాన కార్యదర్శి హరీందర్ కౌర్ బిందు తమ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈ మహోద్యమంలో తామూ భాగస్వాములమేననీ గట్టిగా చెప్తున్నారు.
భూమి కేంద్రంగా..

''మహిళా రైతులు ఆందోళన చెందే మరో విషయం భూమిని కోల్పోవడం. కొత్త చట్టాలతో కాంట్రాక్ట్ వ్యవసాయం నిబంధనల మేరకు రైతులు పెద్ద కార్పొరేట్ పెట్టుబడిదారులు పరస్పరం అంగీకరించిన ధర కోసం, పంటలను ఉత్పత్తి చేస్తారు. ఈ అసమాన స్థితిలో రైతు సేవలను భద్రపరిచే ముసుగులో వ్యవసాయ భూములపై కాంట్రాక్ట్ పెట్టుబడిదారులు పరోక్ష నియంత్రణను కలిగి ఉంటాయి'' అని వ్యవసాయ ఆర్థికవేత్త సుధా నారాయణన్ అంటున్నారు.
''మా జీవనోపాధి వనరు భూమి మాత్రమే. అది మా నుండి తీసివేశాక మాకేం మిగులుతుంది?'' అని చరణ్జీత్ కౌర్ అడుగుతున్నారు. ''ఐదుగురు సభ్యులున్న మా కుటుంబం వ్యవసాయంపై వచ్చే వార్షిక ఆదాయంపైనే ఆధారపడేది. నా భర్త వెన్నుపూసకు గాయం కావడంతో మాకున్న 12 ఎకరాలను కౌలుకు ఇచ్చాం. దానిమీద వచ్చే ఆదాయమే మాకు జీవనాధారం.. ఒప్పందం విషయంలో చట్టపరమైన పరిష్కార విధానం లేకపోవడంపైనే నా ఆందోళన. సమయం కేటాయించలేక, చట్టపరంగా ఎదుర్కోలేక చాలా బలహీనమైన బేరసారాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది'' అంటున్నారు చరణ్జీత్. ముఖ్యమైన వస్తువుల (సవరణ) చట్టం 2020 తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, వంట నూనెలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు తొలగిస్తుంది. అవసరమైన వస్తువుల జాబితా, ఈ వస్తువుల నిల్వ స్టాక్స్‌పై పరిమితినీ తొలగిస్తుంది. పెద్ద వ్యాపారుల ప్రవేశానికి గేట్లు తెరుస్తుంది. ఇది చిన్నరైతులకు మరింత ఆందోళన పెంచే విషయం. అంతేకాదు, ఆకలి, పోషకాహార లోపం వంటివాటి పరిష్కారం ఆందోళన కలిగించేవి. ''ఉత్పత్తులను కార్పొరేట్లు కొనుగోలు చేస్తారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి ప్రభుత్వం రేషన్‌ను ఎలా అందిస్తుంది? ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకోవాలి!'' అని పాటియాలాలోని గురుదిత్‌పురా గ్రామం నుండి భూమిలేని దళిత వ్యవసాయ కూలీ రజిందర్ కౌర్ (42) అడుగుతున్నారు.
కొత్త చట్టాలు రైతులనే కాదు భూమిపై ఆధారపడి ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తాయి. భూమిలేని దళితులు, వ్యవసాయకూలీలు హరిత విప్లవం తర్వాత యాంత్రీకరణతో ఆదాయాల్ని కోల్పోయారు. ఆ సందర్భంగా వచ్చిన ఉపాధి హామీ చట్టం వంటి పథకాలు ఇప్పుడు ఏమవుతాయోనని ఆందోళన చెందు తున్నారు. వీళ్ల వేతనాలు దిగజారతాయి. ''వ్యవసాయ చట్టాలు మా కష్టాలను పెంచుతాయి. వాళ్లు కనీస పనిని తీసివేస్తాము కార్పొరేట్ సేద్యంలో పనిచేయండి అంటారు'' అని పంజాబ్ ఖేత్ మజ్దూర్ యూనియన్‌లో 30 ఏళ్ల నుండి సభ్యులుగా ఉన్న గుర్మెయిల్ కౌర్ (65) అనే దళిత వ్యవసాయ కూలీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన భూమిక వారిదే..

దేశ వ్యవసాయరంగంలో మహిళా శ్రామికులు గణనీయంగా పెరిగారని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. వ్యవసాయ కూలీలు, సాగుదారులుగా మహిళలే అత్యధిక శాతమని 2011 జనాభా లెక్కలు తెలియజేస్తున్నాయి. జాతీయ శాంపుల్ సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) 2011-12 నివేదిక ప్రకారం దేశం మొత్తం మీద గ్రామీణ శ్రామికులలో మహిళలు 75 శాతం వ్యవసాయరంగంలోనే ఉన్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) 2010 నివేదిక ప్రకారం దళిత, ఆదివాసీ సమూహాల్లో వ్యవసాయంలో పనిచేస్తున్న మహిళలు 81 శాతం ఉన్నారు. నిజానికి, దేశ ఆహార భద్రతలో, ముఖ్యంగా పౌష్టికాహారం అందించే చిరుధాన్యాల సాగులో ప్రధాన భాగస్వామ్యం ఏ మద్దతు వ్యవస్థలూ లేని చిన్న, సన్నకారు మహిళా రైతులదే. వాతావారణ ప్రతికూలతలను తట్టుకుంటూ, ఎక్కువ నీరు ఆశించకుండా మనగలిగేలా, భూమి సారాన్ని కాపాడేలా పండేది ఈ 'చిరుధాన్యపు' పంటలే. వాటి గురించి గానీ, వాటిని సాగు చేస్తున్న మహిళా రైతులకుగానీ ప్రభుత్వ పరంగా ఏ మద్దతు విధానమూ ఉండదు.
మేమూ రైతులం..

దేశవ్యాపితంగా ఐదు వందలకు పైగా రైతు సంఘాలు, సంస్థలు ఉన్న ఐక్య వేదిక, ఢిల్లీలో జరుగుతున్న మహోద్యమానికి సమిష్టిగా నాయకత్వాన్ని అందిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా జనవరి 18వ తేదీన 'కిసాన్ మహిళా దివస్' అంటే మహిళా రైతుల నిరసన దినోత్సవం జరిపింది. వివిధ స్థాయిల్లో రైతులుగా మహిళల పాత్రను గుర్తించాలన్న ఆకాంక్షతో ఆ దిశగా పనిచేస్తున్న 'మహిళా కిసాన్ అధికార్ మంచ్ (మకాం)' వంటి జాతీయవేదిక సంయుక్త కిసాన్ మోర్చాలో కీలకమైన భాగస్వామిగా ఉంది. కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో జరుపుతున్న చర్చల్లో మకాం ప్రతినిధిగా కవితా కురుగంటి ఒక ముఖ్యమైన సభ్యురాలు. 'కిసాన్ మహిళా దివస్'ని ఆచరించాలని ఇచ్చిన పిలుపు మహిళలను అలంకారంగా చూపించటానికి కాదు. 'మేమూ రైతులం!' అంటూ వ్యవసాయంలో తమ న్యాయమైన స్థానాన్ని, హక్కుని, స్వరాన్ని స్పష్టంగా సూటిగా వ్యక్తీకరించడం కోసం. ఇది కేవలం ఒక్కరోజుకి పరిమితమైన విషయం కాదు.. సుదీర్ఘ ప్రయాణంలో ఒక ఘట్టం మాత్రమే. ఇది కేవలం ఢిల్లీకి మాత్రమే సంబంధించిన విషయం కాదు. ప్రతి రాష్ట్రంలోనూ మహిళా రైతులు తమ నిరసనని వివిధ రూపాల్లో వ్యక్తం చేయటానికి సమాయత్తమయ్యేందుకు. అదే ఆచరణలో జరిగింది కూడా.
అసమానతలు..
రైతు మహిళల ఆందోళన కు ప్రధానకారణం కొత్త చట్టాలు లింగ వివక్ష ప్రభావం కలిగి ఉండటం. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు ఇప్పటికే భూమి, నీరు, ఇతర వనరుల విషయంలో అసమానతలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తి నియంత్రణ, మండీలుగా ప్రసిద్ధి చెందిన మార్కెట్ కమిటీ (ఎపిఎంసిఎస్) స్థానంలో చేసే మార్పు మహిళా రైతులకు ఆందోళన కలిగించే పెద్ద కారణం. ఎందుకంటే మండీలు గ్రామాల్లో దగ్గరగా ఉండి, భద్రతతో, భూస్వాములు, పురుషాధిక్యత ఉన్నా మహిళా రైతులకు ధర నిర్ణయించే ముఖ్యమైన యంత్రాంగం ఉండి, దోపిడీని తగ్గిస్తాయి. ''మేము ప్రస్తుతం క్వింటాలు బియ్యం రూ.2,200 కు అమ్ముతున్నాం. మండీలు తీసివేస్తే దీనిని మేము సగం ధరకే అమ్ముకోవాలి. బీహార్‌లో ఏమైందో చూస్తున్నాంగా.. 2006లో బీహార్‌లో ఈ పద్ధతి ఉత్పత్తి ధరల పతనానికి దారితీసింది. దీని గురించే నేను ఆందోళన చెందుతున్నాను'' అని రెండెకరాల చిన్నరైతు మంజీత్‌కౌర్ చెప్తున్నారు.
శాంతిశ్రీ
83338 18985