Jul 27,2023 21:39

హరిశ్చంద్రప్రసాద్‌, జెఆర్‌డి.టాటా జయంతి, అబ్దుల్‌కలాం వర్థంతి కార్యక్రమాల్లో వక్తలు
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌

            దేశ ఆర్థిక పురోగతికి ఎనలేని సేవలందించిన మహనీయులను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పారిశ్రామికవేత్త, మైనింగ్‌ ఇంజినీర్‌ ఎం.వెంకటేశ్వరరావు అన్నారు. సర్‌సిఆర్‌ రెడ్డి కళాశాల సిఐఐఇ, ఇడిసి, ఎంబిఎ, ఐక్యూ ఎసి వారి ఆధ్వర్యంలో గురువారం ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆంధ్రా షుగర్స్‌ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్‌ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ జయంతి, టాటా గ్రూప్‌ వ్యవస్థాపక అధ్యక్షులు భారతరత్న జెఆర్‌డి.టాటా జయంతి, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఎపిజె.అబ్దుల్‌కలాం వర్థంతి కార్యక్రమాలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వారు చూపించిన మార్గదర్శకాన్ని అవలంభించటం వల్ల వ్యక్తిగతంగా మనకు, మన దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. డాక్టర్‌ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌, భారతరత్న జెఆర్‌డి.టాటాలు అందుకు ఆదర్శనీయులుగా నిలుస్తారని కొనియాడారు. డాక్టర్‌ ఎపిజె అబ్దుల్‌కలాం తుది శ్వాస వరకు విద్యార్థులను అవగాహన పరచడంలో వారి అభ్యున్నతికి, దేశ సాంకేతిక విజ్ఞాన రంగానికి విశిష్టమైన సేవలందించిన ప్రముఖులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ డాక్టర్‌ కెఎస్‌.విష్ణుమోహన్‌, పీజీ కళాశాల కరస్పాండెంట్‌ కానాల శ్రీనివాసరావు, ఇంటర్మీడియట్‌ కరస్పాండెంట్‌ కె.శివరామకృష్ణప్రసాద్‌, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కెఎ.రామరాజు, ఇంటర్మీడియట్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎ.వీరభద్రరావు, పీజీ కళాశాల ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ విఆర్‌ఎస్‌.బాబు యలమర్తి పాల్గొన్నారు.
భీమడోలులో అబ్దుల్‌కలాం వర్థంతి సభ
భీమడోలు :కెమెరా సృష్టికర్త డ్యాగురే, పీపుల్స్‌ ప్రెసిడెంట్‌గా గుర్తింపు పొందిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం వేదిక వద్ద భీమడోలు సర్కిల్‌ ఫొటోగ్రాఫర్స్‌ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అబ్దుల్‌ కలాం వర్థంతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ గౌరవాధ్యక్షులతో పాటు పిల్లి బ్రహ్మారావు, సంఘ అధ్యక్షులు డి.శ్రీరామ్‌ ఇతర కార్యవర్గ సభ్యులు అబ్దుల్‌కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ యువతకు అబ్దుల్‌కలాం స్ఫూర్తి ప్రదాత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యవర్గ సభ్యులు డేవిడ్‌, పివిఆర్‌.మూర్తి పాల్గొన్నారు.
ముసునూరు : భారత రాష్ట్రపతిగా అబ్దుల్‌కలాం ఎన్నో సేవలందించారని భారతి కాన్వెంట్‌ ప్రిన్సిపల్‌ కొండేటి శౌరి, కరస్పాండెంట్‌ కొండేటి విజయలక్ష్మి అన్నారు. మండల కేంద్రమైన ముసునూరులోని భారతి ఇంగ్లీష్‌ మీడియం కాన్వెంట్‌లో అబ్దుల్‌ కలాం ఎనిమిదో వర్థంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయన చేసిన సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.