Aug 17,2023 20:36

మొక్కలు నాటుతున్న ఆర్‌డిఒ రంగస్వామి

 రాయచోటి : ఎందరో మహనీయుల త్యాగఫలమే నేటి భారతావని అని రాయచోటి ఆర్‌డిఒ రంగస్వామి అన్నారు. శ్రీ సాయి ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలో గురువారం ఆజాదికా అమత్‌ మహోత్సవ్‌ ఉత్సవాలలో భాగంగా ఎస్‌ఎస్‌ఐటిఎస్‌, యువ టూరిజం క్లబ్‌ ఆధ్వర్యంలో నామట్టి - నా దేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాయచోటి ఆర్‌డిఒ హాజరై ప్రసంగించారు. జన్మనిచ్చిన నేలతల్లిని, స్వేచ్ఛగా జీవించేందుకు అవకాశం కల్పించిన దేశాన్ని గౌరవించుకునేలా చేపట్టిన నా మట్టి నా దేశం కార్యక్రమం ఎంతో మహోన్నతమైందని చెప్పారు. ఈ సందర్భంగా భరతమాత చిత్రపటానికి పూలమాలవేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎందరో మహనీయుల త్యాగం ఫలితంగా స్వతంత్ర భారతావని ఏర్పడిందని, ఆ త్యాగమూర్తులను గ్రామస్థాయి నుంచి స్మరించుకొని వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని పిలుపునిచ్చారు. శ్రీ సాయి ఇంజనీరింగ్‌ కళాశాల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ నేల తల్లికి నమస్కారం- వీరులకు వందనం అనే జాతీయ భావనతో విద్యార్థిని విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకొని ,స్వేచ్ఛ స్వతంత్రాలను అందించిన సమరయోధులను గుర్తు చేసుకుని, వారి మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలను నాటి విద్యార్థిని విద్యార్థుల చేత పంచప్రాన్‌ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి నాగభూషణ్‌, రాయచోటి మున్సిపల్‌ కమిషనర్‌ గంగా ప్రసాద్‌, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ శివశంకర్‌, డిస్టిక్‌ ఇండిస్టియల్‌ ఆఫీసర్‌, జనరల్‌ మేనేజర్‌ నాగరాజు, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వి. బాలాజీ, వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.