ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి లాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే అధికారులు, ఉద్యోగులు తమ వద్దకు వచ్చే పేదలకు సేవలందించాలని కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలను కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ వారి విగ్రహాలకు, చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి దేశానికి ఎన్నో విధాలుగా సేవలందించారని కొనియాడారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ సేవా దక్పథాన్ని అలవర్చుకోవాలని పేర్కొన్నారు. ఆహార భద్రతను కాపాడటంలో లాల్ బహుదూర్ శాస్త్రి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆ మార్గంలో పయనించి ఇటీవల కన్నుమూసిన ఎంఎస్ స్వామినాథన్ కూడా దేశ ప్రజలకు ఎన్నోరకాలుగా సేవలు అందించారని, హరిత విప్లవం తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.డి. అనిత, ట్రైనీ కలెక్టర్ వెంకట త్రివినాగ్ పాల్గొన్నారు.

బాపూజీ కన్న కలలు సాకారం
గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కన్న కలలను సాకారం చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతోందని జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. గ్రామీణుల చెంతకే పరిపాలన వ్యవస్థను తీసుకువెళ్లి సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాయలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాంధీజీ చిత్రపటానికి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, సిఇఒ రాజ్‌కుమార్, డిపిఒ నిర్మలాదేవి, పలువురు జిల్లాపరిషత్ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భావితరాలకు మార్గదర్శి : కోలగట్ల
మహాత్మా గాంధీ చూపిన స్ఫూర్తి భవిష్యత్ తరాలకు మార్గదర్శి అని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని విటి అగ్రహారం పారిశ్రామిక శిక్షణ కేంద్రం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. వైసిపి యువజన విభాగం ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద నిర్వహించిన సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సన్మానించి నిత్యవసర వస్తువులను అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ గిరి, వైసిపి యువజన విభాగం నాయకులు ఈశ్వర్ కౌశిక్, సంఘం రెడ్డి బంగారనాయుడు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
డిసిఎంఎస్ ఆధ్వర్యాన
మహానీయులను ఆదర్శంగా తీసుకుని వారి స్పూర్తితో ముందుకు సాగాలని డిసిఎంఎస్ చైర్ పర్సన్ డాక్టర్ అవనాపు భావన, వైసిపి నాయకులు అవనాపు విక్రమ్.. గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా డిసిఎంఎస్ కార్యాలయంలో అవనాపు భావన విక్రమ్ దంపతులు మహానీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి,నివాళ్లు అర్పించారు.
సత్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో గాంధీ జయంతి
సత్యా విద్యాసంస్థలు ఆధ్వర్యాన సోమవారం గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి ఆ సంస్థల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు పూలమాలవేసి నివాళులు అర్పించారు. గతనెల 25 నుంచి వారం రోజులు పాటు పలు కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. స్వచ్ఛభారత్, నగరంలోని గాంధీజీ విగ్రహాలను శుభ్రం చేయడం, ర్యాలీ, తమ పరిసరాలను పరిశుభ్రాం ఉంచుతామని ప్రతిజ్ఞ, గాంధీజీ విగ్రహాలను పూల మాలలు వేసి నివాళి అర్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవి సాయి దేవ మణి, ఎన్‌సిసి ఆఫీసర్లు కెప్టెన్ ఎం సత్యవేణి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










