
ప్రజాశక్తి-తాడేపల్లి : దేశం కోసం సేవ చేసిన మహనీయుల చరిత్రను అధ్యయనం చేయాలని విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాల విశ్రాంత వైస్ ప్రిన్సిపల్ గుమ్మా సాంబశివరావు కోరారు. శనివారం గుర్రం జాషువా జయంతి సందర్భంగా తాడేపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్, రవీంద్రభారతి హైస్కూల్లో జరిగిన జాషువాపై జరిగిన వ్యాసరచన పోటీల్లో బహుమతి ప్రదానోత్సవ సభ, సర్టిఫికెట్లు అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఈ సదర్భంగా జరిగిన సభలకు భీమిరెడ్డి తాతిరెడ్డి, ఎస్‌కె ఖమ్మర్ హుస్సేన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ చదువంటే పాఠ్య పుస్తకాలే కాదని సమాజంలో జరుగుతున్న మార్పులను కూడా గమనించాలని అన్నారు. గుర్రం జాషువా చదివింది 8వ తరగతి అయినా సమాజంలో జరుగుతున్న అనేక రుగ్మతలను తన నవలలు, రచనల ద్వారా ప్రపంచం ముందు ఉంచారని కొనియాడారు. జాషువా చిత్రలేఖనం పట్ల మక్కువ చూపేవారని చెప్పారు. ఓ రోజు ఉపాధ్యాయుని బొమ్మను యధావిధిగా వేయడంతో జాషువాలోని శక్తియుక్తులను గమనించి ఉపాధ్యాయులు ప్రోత్సహించారని చెప్పారు. చిన్నతనంలోనే చుట్టుపక్కల జరుగుతున్న అనేక విషయాల మీద పద్యాలు పాడి పామర్లను సైతం ఆలోచింపజేశారని వివరించారు. ఎక్కడైతే అవమానపడ్డారో వారందరి చేత ప్రశంసలు పొంది చివరకు విశ్వనరుడని నిరూపించుకున్నారని చెప్పారు. బాలోత్సవాల రాష్ట్ర కన్వీనర్ పి.మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఎన్నో నైపుణ్యాలు దాగి ఉంటాయని చెప్పారు. ఎవరూ తక్కువ కాదని వారి ఆసక్తులను బట్టి రాణించాలని కోరారు. నేటికీ సమాజంలో పురుషాధిక్యం కొనసాగుతుందని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించడం శుభపరిణామమన్నారు. విశ్రాంత ఎంపిడిఒ, మేజీషియన్ ఎస్.ఆదినారాయణ మాట్లాడుతూ మనుషులందరూ ఒక్కటైన్పుడు ఎక్కువ తక్కువ ఎందుకని ప్రశ్నించారు. కష్టపడి పని చేసే వారికి తిండి లేని సమాజం మనకెందుకని అన్నారు. వినుకొండలో జన్మించిన జాషువాకు ప్రభుత్వం రెండెకరాల భూమి, ఇల్లు ఇచ్చి గౌరవించిందంటే ఆయన గొప్పతనాన్ని నేటి తరం అర్థం చేసుకోవాలని కోరారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు మెడల్స్‌తో పాటు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమాల్లో మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం కోశాధికారి గాదె సుబ్బారెడ్డి, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.