Jul 14,2023 22:31

ప్రజాశక్తి - నిడమర్రు
      మహనీయుల ఆశయాలను విద్యార్థులు ముందుకు తీసుకెళ్లాలని ప్రముఖ రచయిత కూనపరాజు కుమార్‌ అన్నారు. 'మహనీయుల ప్రచార కమిటీ' ఆధ్వర్యంలో విద్యాలయాలకు అల్లూరి సీతారామరాజు చిత్రపటాలను అందించే కార్యక్రమాన్ని నిడమర్రు హైస్కూల్లో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయరాలు బి.రాజేశ్వరి అధ్యక్షతన జరిగిన విద్యార్థుల, ఉపాధ్యాయుల సభలో కూనపరాజు మాట్లాడారు. గణపవరానికి చెందిన శ్రీలక్ష్మి గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ అధినేత సూరెడ్డి శ్రీనివాసరావు సౌజన్యంతో ఈ చిత్రపటాలను అందిస్తున్నామన్నారు. అల్లూరి జీవిత చరిత్రను పరిశీలిస్తే ఆయన గొప్ప త్యాగం కనిపిస్తుందన్నారు. 40 ఏళ్ల క్రితం తాను అల్లూరి జీవిత చరిత్ర పుస్తకం రాయడం కోసం ప్రయత్నిస్తే ఎన్నో గొప్ప విషయాలు తెలిశాయన్నారు. గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ జిల్లాలో వివిధ మండలాల్లో విద్యార్థులకు మహనీయుల జీవిత విశేషాలు తెలియజేసేందుకు మహనీయుల ఆశయాల ప్రచార కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహనీయుల వివరాలు, ఫొటోలతో ముద్రిస్తున్న క్యాలెండర్‌ను హెడ్‌మాస్టర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎవిఆర్‌ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, మానవత స్వచ్ఛంద సంస్థ జిల్లా పూర్వపు అధ్యక్షులు సాగిరాజు జానకీరామరాజు, గణపవరానికి చెందిన శ్రీలక్ష్మీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ అధినేత సూర్రెడ్డి శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి నారపల్లి రమణారావు, కళ్యాణ్‌, మైలవరపు లాలయ్య, ఉపాధ్యాయులు డి.అప్పారావు, ఎస్‌.శ్రీనివాసరావు, ఎం.ప్రసాద్‌, జి.లక్ష్మీనారాయణ, మానవత సంస్థ జిల్లా నాయకులు సాగిరాజు జానకీరామరాజు పాల్గొన్నారు.
అనంతరం స్కూల్‌కు అల్లూరి చిత్ర పటం, జీవిత చరిత్ర పుస్తకాలు-10, నిడమర్రుకు చెందిన ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్‌.నారాయణ జీవిత చరిత్ర పుస్తకాలు-3 అందజేశారు.