అన్నే అనసూయ, జెన్నీ మార్క్స్ వర్థంతి సభలో వక్తలు
ప్రజాశక్తి - ఏలూరు
మహనీయుల ఆశయ సాధన కోసం కృషి చేయడమే నిజమైన నివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక పవర్‌పేటలోని అన్నే భవనంలో అన్నే అనసూయ ఐదో వర్థంతి, జెన్నీ మార్క్స్ 141వ వర్థంతి సభను ఎవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు అధ్యక్షతన నిర్వహించారు. తొలుత అన్నే అనసూయ, జెన్నీ మార్క్స్ చిత్రపటాలకు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. సభలో రవి మాట్లాడుతూ సమ సమాజ నిర్మాణం ఆశయ సాధన లక్ష్యంగా అనసూయ, జెన్నీ మార్క్స్ కృషి చేశారని కొనియాడారు. మహిళల హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. తమ యావత్ జీవితాన్ని పీడిత ప్రజల హక్కుల కోసం త్యాగం చేశారని చెప్పారు. నేటి సమాజంలో మహిళలు, దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, వ్యవసాయ కార్మికుల కష్టాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పీడిత ప్రజలు తమ హక్కుల కోసం మహానీయుల త్యాగాల స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. హేలాపురి బాలోత్సవం కమిటీ అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కన్వీనర్ పి.హైమావతి, ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.సోమయ్య మాట్లాడారు. కార్యక్రమంలో అనసూయ కుటుంబ సభ్యులు అన్నే కల్పన, కిలారి సీతారామయ్య, వివిధ సంఘాల నాయకులు పి.కిషోర్, వి.సాయిబాబు, బి.జగన్నాథరావు, వివిఎన్.ప్రసాద్, జె.గోపీ, జి.శారద, పి.వెంకటరమణ, ఎ.ఉషారాణి, నిర్మల పాల్గొన్నారు.
ఐద్వా ఆధ్వర్యాన
అన్నే అనసూయమ్మ ఆశయ సాధనకు నిరంతర కృషే ఆమెకు నిజమైన నివాళులు అని ఐదా జిల్లా కన్వీనర్ పి.హైమావతి అన్నారు. స్వాతంత్ర సమరయోధురాలు, మహిళా ఉద్యమ నేత అన్నే అనసూయమ్మ ఐదో వర్థంతి సభ ఐద్వా నగర కమిటీ అధ్వర్యంలో స్థానిక గన్ బజార్ సెంటర్లో నిర్వహించారు. ఈ సభలో హైమావతి మాట్లాడుతూ అనసూయమ్మ స్వాతంత్రోద్యమంలో గాంధీ పిలుపును అందుకుని తన బంగారాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాడారన్నారు. వ్యవసాయ కార్మికులు, పేదల కోసం జరిగిన పోరాటాల్లో ఆమె జైలు జీవితం గడిపారని తెలిపారు. తుదిశ్వాస విడిచే వరకూ మహిళా ఉద్యమంలో పని చేశారన్నారు. తొలుత అనసూయమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి.కిషోర్ మాట్లాడారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు టి.సుకన్య, వి.వెంకటరమణ, హేమలత, ఎన్.రాజేశ్వరి, బి.జ్యోతి, ఎన్.దుర్గ, జి.సోనీ, ఆర్.రమాదేవి, జె.గీత, డి.సంధ్య, బి.గంగ, బి.శిరీష పాల్గొన్నారు.










