Oct 23,2021 06:35

డ్రాపౌట్లలో ఎక్కువ మంది బాలికలేనని, మహమ్మారి కారణంగా ఈ సంఖ్య మరింత పెరిగిందంటారు మహిళా సాధికారతపై పనిచేసే సంస్థ 'సెంటర్‌ ఫర్‌ సోషల్‌ రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌' ఆఫీసర్‌ నిహారికా సింగ్‌. 'హర్యానాలో పనిచేస్తున్నప్పుడు డ్రాపౌట్‌ బాలికలు ఎక్కువగా వివాహ నిమిత్తం స్కూలు మానేశారని తెలుసుకుని వారితో మాట్లాడి తిరగి బడికి పంపించాం. కాని మహమ్మారి వచ్చి ఆ పరిస్థితిని మరింత దిగజార్చింది' అంటారు సింగ్‌.

   దేశ వ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకున్నాయి. పేదరికం వల్ల, సాంకేతికత అందుబాటులో లేక ఆన్‌లైన్‌ పాఠాలు అందని విద్యార్థులంతా ఇప్పుడు తరగతులకు హాజరవుతున్నారు. ఇది సంతోషించదగ్గ విషయమే కానీ నేటికీ 35 లక్షల మంది విద్యార్థులు బడి బయటే ఉండిపోయారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. లెక్కకు రానివారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య ఆందోళనకర స్థాయికి ఎగబాకుతుందనడంలో సందేహం లేదు.
    న్యూఢిల్లీ ఫరీదాబాద్‌కు చెందిన సతీష్‌ యాదవ్‌ సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. కరోనా రెండో దశ లాక్‌డౌన్‌లో అతని ఉద్యోగం పోయింది. 45 ఏళ్ల సతీష్‌కు ఇద్దరు పిల్లలు. కుటుంబ పోషణ కోసం పండ్లు అమ్ముకుంటూ జీవించసాగాడు. పిల్లల తిండికి, ఆలనాపాలనకు ఆ ఆదాయం సరిపోయేది. కాని పిల్లల చదువుకు సరిపోయేది కాదు. దీంతో ఇద్దరు పిల్లల్లో పెద్దదైన కూతురు చదువు మధ్యంతరంగా ఆపేయాల్సి వచ్చింది. 'నా కూతురును బడికి పంపించేందుకు ఇంకా రెండు మూడేళ్ల సమయం పడుతుంది. నాకున్న పరిమిత ఆదాయంతో కొడుకును మాత్రమే చదివించగలను.' అంటున్న సతీష్‌ కూతురు 9వ తరగతి చదువుతుంటే, కొడుకు 5వ తరగతి చదువుతున్నాడు. పండ్ల అమ్మకందారుడిగా అతనికి రూ.10 వేలు ఆదాయం వస్తుంది. గార్డుగా రెట్టింపు ఆదాయం సమకూరేది. ఇప్పుడది పోయింది.
     ఒంటరి తల్లైన సుమన్‌ వర్మ కూతురుకు వచ్చే ఏడాదికి 18 ఏళ్లు వస్తాయి. ఢిల్లీ నంగ్లోరుకి చెందిన వర్మ లాక్‌డౌన్‌లో తన ఆదాయంలో పెద్ద మొత్తాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో కూతురు చదువు మాన్పించేసింది. ఇంటిపని చేసుకుని జీవించే వర్మ నాలుగిళ్లలో పనిచేసేది. లాక్‌డౌన్‌తో పనిపోయింది. ప్రస్తుతం ఒకే ఒక్క ఇంటిలో పనికి కుదిరింది. గతంలో రూ.15 వేలు ఆదాయం పొందేది. ఇప్పుడు రూ.5 వేలకు పడిపోయింది. ఆ మొత్తం తనకు, కూతురు పోషణకే సరిపోతుంది అంటుంది వర్మ. 'ఇటువంటి పరిస్థితుల్లో నా కూతురు చదువు కొనసాగించాలని నేను అనుకోవటం లేదు. పైగా వచ్చే ఏడాది ఆమెకు వివాహం చేయాలనుకుంటున్నాను. ఇప్పటి నుంచే డబ్బు ఆదా చేసుకోవాలి' అంటుంది వర్మ.
    మహమ్మారి ప్రభావంతో ఎదురైన లాక్‌డౌన్‌లు దేశంలో విద్యను ఎలా ప్రభావితం చేశాయో ఈ రెండు కుటుంబాలు ఉదాహరణలు మాత్రమే! ఈ కోవిడ్‌ సమయంలో దిగువ, మధ్యతరగతి కుటుంబాల పిల్లల్లో బాలికల విద్య ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. విద్యా మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 35 లక్షల మంది పిల్లలు బడి మానేస్తున్నారు. రాష్ట్రాలు ఇంకా లెక్కింపు ప్రక్రియలోనే ఉన్నాయి. అవి ముగిసిన తరువాత వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. పాఠశాలలో లేని పిల్లలను గుర్తించాలని కేంద్రం, రాష్ట్రాలను కోరిన మీదట జనవరి 2021, అక్టోబరు మొదటివారం మధ్య ఈ సమాచారం మంత్రిత్వ శాఖకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన నివేదికల సమాచారాన్ని 'ప్రబంధ్‌' పోర్టల్‌లో జూన్‌ నుంచి అప్‌లోడ్‌ చేశారు. దాని ప్రకారం అత్యధిక డ్రాపౌట్‌ శాతం ఒరిస్సా (22 శాతం)లో ఉంటే ఆ తరువాత లడఖ్‌ (18 శాతం), నాగాలాండ్‌ (16 శాతం) ఉన్నాయి. ఉదాహరణకు మహారాష్ట్రలో 25 వేల మంది విద్యార్థులు గతేడాది చదువు మానేశారని మార్చిలో చేసిన సర్వేలో తేలింది. తమిళనాడులో లక్షా 25 వేల మంది విద్యార్థులు బలవంతంగా పాఠశాల నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఆర్థికవేత్త జీన్‌డ్రెజ్‌ నేతృత్వం లోని స్కూల్‌ ఎడ్యుకేషన్‌పై అత్యవసర నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థుల్లో 37 శాతం మందికి మహమ్మారి కారణంగా చదువు మధ్యంతరంగా ఆగిపోయింది. అస్సాం, బీహార్‌, ఢిల్లీ, గుజరాత్‌, హర్యానా, జార్ఖండ్‌, కర్నాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఈ సర్వే జరిగింది.
     విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో బాలికల శాతం స్పష్టంగా లేదు. కాని బెంగళూరుకు చెందిన స్వచ్ఛంద సంస్థ 'ఆహ్వాన్‌ ఫౌండేషన్‌' సర్వేలో డ్రాపౌట్‌ ధోరణి ఎక్కువగా దిగువ మధ్యతరగతి కుటుంబాలు, వలస కార్మికులు, చిల్లర వర్తకుల కుటుంబాల నుంచే ఎక్కువగా ఉందని తేలింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా తక్కువ ఆదాయ కుటుంబాలకు క్యాటరింగ్‌ ఇచ్చే బాధ్యతతో ఆయా పాఠశాలలతో కలసి పనిచేస్తోంది. సంస్థ మద్దతు ఇచ్చే బెంగళూరు పాఠశాలల్లో 1702 మంది విద్యార్థుల్లో 252 మంది చదువు మానేశారు. ఇందులో 179 మంది బాలికలు. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌ పాఠశాలల్లో 3,864 మంది విద్యార్థుల్లో 836 మంది కోవిడ్‌ సమయంలో చదువు మానేశారు. వారిలో 543 మంది బాలికలు. ముంబైలో 1,603 మంది విద్యార్థుల్లో 126 మంది చదువు నుంచి తప్పుకుంటే వారిలో 98 మంది బాలికలు.
     సోషల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ప్రముఖ ప్రొఫెసర్‌, నేషనల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ప్లానింగ్‌ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ గోవింద్‌ ఈ అంశంపై మాట్లాడుతూ 'పాఠశాలల నుంచి తప్పుకుంటున్న విద్యార్థుల సమస్య చాలా తీవ్రమైనది. కాని దీనిపై శ్రద్ధ చూపడం లేదు. డ్రాపౌట్‌ విద్యార్థుల్లో రెండు కేటగిరీలు మనం చూడాల్సి వుంది. మహమ్మారి కారణంగా పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడ్డారు. దీనివల్ల చదువుకు దూరమయ్యారనుకుంటే ఇటువంటి విద్యార్థుల కుటుంబాలు ఆడపిల్లల చదువు అదనపు భారంగా భావించడం. ఇక రెండో కేటగిరీ విద్యార్థులు దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు. వీరంతా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లల్లో చదివిస్తుంటారు. మహమ్మారి వల్ల స్కూళ్లు మూతబడి చాలామంది విద్యార్థులు డ్రాపౌట్లుగా మిగిలిపోయారు'. ఇక డ్రాపౌట్లలో ఎక్కువ మంది బాలికలేనని, మహమ్మారి కారణంగా ఈ సంఖ్య మరింత పెరిగిందంటారు మహిళా సాధికారతపై పనిచేసే సంస్థ 'సెంటర్‌ ఫర్‌ సోషల్‌ రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌' ఆఫీసర్‌ నిహారికా సింగ్‌. 'హర్యానాలో పనిచేస్తున్నప్పుడు డ్రాపౌట్‌ బాలికలు ఎక్కువగా వివాహ నిమిత్తం స్కూలు మానేశారని తెలుసుకుని వారితో మాట్లాడి తిరగి బడికి పంపించాం. కాని మహమ్మారి వచ్చి ఆ పరిస్థితిని మరింత దిగజార్చింది' అంటారు సింగ్‌.
    మహమ్మారి కారణంగా కోటి మంది బాలికలు చదువు మానేసే ప్రమాదం ఉందని జనవరిలో విద్యాహక్కుల ఫోరం అంచనా వేసింది. ఇంకా ఈ మహమ్మారి 'ఆడపిల్లలను ముందస్తు వివాహం, అక్రమ రవాణాకు, పేదరికానికి గురిచేస్తుందని' పేర్కొంది. ప్రభుత్వాలు సత్వరం ఈ సమస్యపై స్పందించి డ్రాపౌట్‌ విద్యార్థులు, బాలికలను తిరిగి స్కూళ్లకు రప్పించేలా చర్యలు తీసుకోవాలి.
 

- ఫీచర్స్‌ డెస్క్‌