Mar 18,2021 06:40

దేశంలో కరోనా రక్కసి మళ్లీ విజృంభిస్తోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, హర్యానా, పంజాబ్‌, తమిళనాడులతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో ఉండటం కలవరపరిచే విషయం. తాజాగా కేసుల బారిన పడుతున్న అత్యధిక మందిలో వ్యాధి లక్షణాలు ఏ మాత్రం కనపడటం లేదని చెబుతున్నారు. ఇది పరిస్థితిని మరింత క్లిప్టంగా మారుస్తోంది. ఈ దశలో ప్రభుత్వాలు మరింతగా క్రియాశీల పాత్ర నిర్వహించాల్సి ఉంది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ సైతం అటువంటి భరోసా ఏమీ ఇవ్వలేకపోయింది. వ్యాధి నిరోధానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవడానికి బదులుగా మొత్తం బాధ్యతను రాష్ట్రాల పైకి తోసివేయడానికి, హెచ్చరికలు చేయడానికి, జాగ్రత్తలు చెప్పడానికే ప్రధాని మొగ్గుచూపారు. మహమ్మారిని అరికట్టే దిశలో ఒక్క నూతన చర్యనుగానీ, కార్యక్రమాన్నిగానీ ప్రకటించకపోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? నిజానికి, దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ జరుగుతున్న సమయమిది! వివిధ కారణాలతో ఆ కార్యక్రమం అనుకున్నంత వేగంగా సాగడం లేదు. దీనిని ఉధృతంగా కొనసాగించాల్సి ఉంది. అలా జరగాలంటే క్షేత్ర స్థాయిలో మౌలిక సదుపాయాలను, మానవ వనరులను పెద్ద ఎత్తున పెంచాల్సి ఉంది. అందుకోసం రాష్ట్రాలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కేంద్రం అందించాలి. కానీ, ఆ ఊసే లేకుండా 'టీకా కేంద్రాలు పెంచండి... పరీక్షలు పెంచండి' అని ప్రధాని చెప్పారు. కార్యాచరణ లేకుండా ధర్మోపన్యాసాలతో ప్రయోజనం ఏమిటి?


భారీ ఎత్తున కేసులు పెరిగి, పరిస్థితి అదుపు తప్పితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై ఆ నెపాన్ని తోసివేయవచ్చన్న ఆలోచనో ఏమో కానీ, రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా కరోనా నివారణ చర్యలను పూర్తిగా పక్కనబెట్టేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే ప్రాంతంలోనే కాదు, జరగని ప్రాంతాల్లో కూడా ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. కరోనా నిబంధనలను ఉల్లంఘించేవారిని హెచ్చరించే వారే కరువయ్యారు. బహిరంగ స్థలాలు, మార్కెట్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, చివరికి ఆర్‌టిసి బస్సుల్లో కూడా భౌతికదూరం పాటించడం, శానిటైజర్‌ వినియోగించడం వంటి చర్యలను మానివేశారు. ఆర్‌టిసి బస్సులైతే కరోనాకు ముందు రోజుల మాదిరి ప్రయాణీకులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ పరిస్థితికి కారణం ప్రజలు మాత్రమేనా? ప్రభుత్వానికి బాధ్యతేమీ లేదా? ప్రభుత్వం గట్టిగా అనుకుంటే దీనిని నియంత్రించలేదా? తొలి దశ విజృంభణ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన నర్సింగ్‌, పారామెడికల్‌ సిబ్బంది పట్ల ఏరు దాటాక తెప్ప తగలేసిన తీరుగా వ్యవహరించడం ఎంత వరకు సబబు? ఉద్యోగాల్లో కొనసాగించడం సంగతి అలా ఉంచి, చేసిన పనికి జీతాలు కూడా ఇవ్వకుండా మెడపెట్టి గెంటేశారే... ఇప్పుడేం చేస్తారు? కొత్తగా ముంచుకొస్తున్న ముప్పును వారి సహాయం లేకుండా ఎలా అధిగమిస్తారు?


గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే అధికార యంత్రాంగంలోనూ, వైద్యులలోనూ, ప్రజల్లోనూ ప్రస్తుతం కరోనా పట్ల అవగాహన పెరిగింది. చికిత్సకు సంబంధించిన ఒక విధానం దాదాపుగా స్థిరపడింది. ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ అప్పట్లో లేని ఆయుధం వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సానుకూలతలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకోవాలి. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థల నవనాడులను కుదింపచేసే లాక్‌అవుట్‌ వంటి చర్యలు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోలేవని తేలింది. దీనికి బదులుగా విస్తృతంగా పరీక్షలు చేయడం, వ్యాధి గ్రస్తులను గుర్తించడం, వారిని వేరు చేసి చికిత్స అందించే వ్యూహాన్ని పెద్ద ఎత్తున అమలు చేయాలి. గత ఏడాది జులై, ఆగస్టు నెలలో సాగిన విధంగా ఈ ప్రక్రియ వుండాలి. కార్పొరేట్‌ ఆస్పత్రుల కాసుల కక్కుర్తి ఇప్పటికే బట్టబయలైన నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రులను క్షేత్రస్థాయి వరకు బలోపేతం చేయాలి. అవసరమైన సిబ్బందిని నియమించాలి. వీటిని చేస్తూనే సార్వత్రిక ఉచిత టీకా పంపిణీ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలి. ప్రతి ఒక్కరికీ టీకా వేయాలి. అప్పుడే కరోనాను అదుపులో పెట్టగలం!