ప్రజాశక్తి-అనకాపల్లి
మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టడంలో అందరూ భాగస్వాములు కావాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి ఎస్.అరుణ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ హింస వ్యతిరేక దినోత్సవాలను పురస్కరించుకొని సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 'హింస లేని సమాజాన్ని నిర్మిద్దాం- సమానత్వ సాధనకై పయనిద్దాం' అన్న అంశంపై జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు. మహిళలపై హింస అత్యాచారాలు పెరగడానికి మద్యం, మత్తు పదార్థాలు ప్రధాన కారణమని, వీటిని ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు. సమానత్వ స్థాయిని పెంచే అంశాలను పాఠ్యాంశాలలో పొందుపరచాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో అశ్లీల అంశాలను నిరోధించాలని, సైబర్ నేరాలను అరికట్టాలని కోరారు. ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి సుభాషిణి మాట్లాడుతూ మహిళలను కించపర్చిన రాందేవ్ బాబా, గరికపాటి తక్షణమే క్షమాపణ చెప్పాలన్నారు.వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.










