మహిళపై చిరుత దాడి
ప్రజాశక్తి- వెదురుకుప్పం
గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండల పరిధిలోని ఎర్రగుంటపల్లి సమీపంలోగల ఓ తెల్లరాతి కంకర క్వారీ వద్ద మహిళపై చిరుత పులి దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. శ్రీలక్ష్మీ శ్రీనివాస స్టోన్ క్రషర్‌లో పనిచేస్తున్న కూలీలకు భోజన తయారీదారుగా వ్యవహరిస్తున్న తిరుపతి జిల్లా వెంకటగిరి ప్రాంతానికి చెందిన శైలజ ఆదివారం మధ్యాహ్నం కాలకృత్యాలు తీర్చుకోవడానికి తాము నివాసముంటున్న ప్రాంతానికి కొద్ది దూరం వెళ్లినట్లు తెలిపారు. అక్కడే పొదల్లో పొంచి ఉన్న చిరుత పులి మహిళపై ఒక్కసారిగా దాడి చేయడంతో ఆమె భయాందోళనకు గురై గట్టిగా కేకలు వేయడంతో చిరుత పారిపోయినట్లు తెలిపారు. చిరుత దాడిలో గాయపడిన మహిళను పచ్చికాపల్లం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం 108 ద్వారా తిరుపతి రుయాకు తరలించారు. మహిళపై చిరుత దాడి విషయమై అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ మహిళపై దాడికి పాల్పడింది చిరుత పులి కాకపోవచ్చు అని, హైనాగా ఉండొచ్చని అంటున్నారు. సంఘటనా స్థలంలోని పాదముద్రలు, మహిళకు అయిన గాయాలను పరిశీలించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.










