Jun 28,2023 23:39

మహిళలు, యువకులుఆందోళన

ప్రజాశక్తి-కొత్తకోట:రావికమతం మండలం కొత్తకోటలో జనావాసాలు మద్య ఏర్పాటు చేసిన తారు యంత్రాన్ని తక్షణం తొలగించాలని డిమాండ్‌ చేస్తూ పలువురు మహిళలు, యువకులు తారు ప్లాంట్‌, పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం సాయంత్రం ఆందోళన చేశారు. రోలుగుంట మండలం వెలంకాయపాలెం నుంచి గంధవరం వరకూ రహదారి విస్తరణ పనులు చేస్తున్న ఎస్‌ఆర్‌ కనస్ట్రక్షన్‌ నిర్వాహకుడు స్థానిక ప్రకాష్‌ నగర్‌ ఆనుకుని జనావాసాల మధ్య తారు, మెటల్‌ మిక్సింగ్‌ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. మొదట్లో పెద్దగా పొగ రాకున్నా గడచిన 15 రోజులుగా దీని నుంచి దట్టమైన తారుపొగ వెదజల్లుతోంది. సమీపంలోని ఇళ్లల్లోని జనం ఈ పొగ దాటికి ఉక్కిరి బిక్కిరి. అవుతున్నారు. గుండెలు మండిపోతున్నాయని దగ్గు విపరీతంగా వస్తోందంటూ నివాశితులు చింతల కిషోర్‌, లావణ్య, మహాలక్ష్మి, జెవి.వరలక్ష్మి కోట వీరాస్వామి తదితర్లు ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేశారు. తక్షణం ప్లాంట్ను వేరే చోటికి తరలించాలన్నారు. అనంతరం పంచాయితీ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేసి వినతిపత్రాన్ని ఉప సర్పంచ్‌ పందల దేవాకు అందించారు. సంఘటనా స్థలానికి కొత్తకోట సిఐ సయ్యద్‌ ఇలియాస్‌ మహ్మద్‌ చేరు కొని ఆందోళన చేస్తున్న గ్రామస్తులతో మాట్లాడారు. రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్‌తో మాట్లాడి సమస్య పరిష్కరానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.