Oct 05,2023 23:12

మహిళా పారిశ్రామిక వేత్తల వర్క్‌షాపులో మాట్లాడుతున్న మంత్రి అమర్‌నాథ్‌

ప్రజాశక్తి-విశాఖపట్నం : మహిళలు వివిధ వ్యాపార రంగాలలో విభిన్న ఆలోచనలతో ముందుకు సాగాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సూచించారు. రాడిసన్‌ బ్లూ హోటల్‌లో గురువారం మహిళా పారిశ్రామిక వేత్తల వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అమర్‌నాథ్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్నోహన్‌రెడ్డి నేతృత్వంలో పారిశ్రామికాభివృద్ధి జరుగుతోందని, మహిళా పారిశ్రామిక వేత్తలకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అందిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 36 ఇంక్యుబేషన్‌ సెంటర్లు ఉన్నాయన్నారు. ఎంటర్‌ప్రెన్యూర్స్‌ విజయవంతం కావడానికి మెంటారింగ్‌, నెట్‌ వర్కింగ్‌ ముఖ్యమైన అంశాలని వివరించారు. రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, తిరుపతి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాయని నాన్కామ్‌ పేర్కొందని తెలిపారు. కొత్తగా పారిశ్రామిక రంగంలో అడుగు పెట్టిన వారు ఎన్నో అపజయాలను ఎదుర్కొంటారని, దాని నుంచి వారు పాఠాలు నేర్చుకొని ముందుకు సాగి విజయాలను సొంతం చేసుకోవాలని సూచించారు.
ఐటి విభాగం కార్యదర్శి కోన శశిధర్‌ మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలతో వర్క్‌షాప్‌ నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి, పరిశ్రమల శాఖా మంత్రి ఆదేశాలు, సూచనలతో రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, అభివృద్ధి ఎంతగానో జరుగుతోందన్నారు. ఎక్కడైనా మహిళలు ఫౌండర్స్‌గా ఉన్న చోట అభివృద్ధి ఉంటుందన్నారు. సాంకేతికపరిజ్ఞానంతో వ్యాపారంలో అభివృద్ధి సాధించవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ఎపి ఇన్నోవేటివ్‌ సొసైటీ కింద ఎన్నో ప్రణాళికలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పారిశ్రామిక వేత్తల కోసం 65వేల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉందని చెప్పారు. ఎపి స్టార్టప్‌ పోర్టల్‌లో అన్నిఅంశాలు ఉంటాయన్నారు.
వ్యాపారంలో రాణించాలంటే మంచి ఆలోచన, బిజినెస్‌ స్కిల్స్‌, స్పీకింగ్‌ నైపుణ్యాలు ఉండాలన్నారు. అవకాశాలు పట్టణ, గ్రామీణ తేడాలు ఉండవని, అందరికి సమానంగా ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం మంత్రి అమర్‌నాథ్‌ సమక్షంలో కోన శశిధర్‌, పలువురు పారిశ్రామిక వేత్తలతో ఎంఒయులను కుదుర్చుకున్నారు. ఎడ్వంచర్‌ స్కూల్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, ఎన్టెనీ వెంచర్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, హెడ్‌ స్టార్ట్‌ నెట్‌ వర్క్‌ ఫౌండేషన్‌, వురు ఫౌండర్‌ సర్కిల్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ తదితర కంపెనీలు ప్రభుత్వంలో ఎంఒయులు చేసుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ఐటాప్‌ ప్రెసిడెంట్‌ లక్ష్మి ముక్కవిల్లి, నాస్‌కామ్‌ సిఇఒ సంజీవ్‌ మల్హోత్రా, నీతి అయోగ్‌ మెంబర్‌ యశోదరా బజోరియా, ఎస్‌టిపిఐ విశాఖపట్నం అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సురేష్‌ బాతా, ఎన్‌ఆర్‌డిసి డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌ సుధ, పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.