* ఎపిఎం కూర్మారావు
ప్రజాశక్తి- ఆమదాలవలస: మహిళలు ఐకమత్యంగా ఉండి, ఆర్థికంగా రాణిస్తేనే, కుటుంబ అభివద్ధితోపాటు, దేశాభివద్ధి సాధ్యపడుతుందని వైఎస్సార్ క్రాంతి పథం అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ పైడి కూర్మారావు తెలిపారు. శక్రవారం అక్కివరం పంచాయతీ గోపీనగర్ పరిధిలోని మాసయ్యపేటలో మండల సమాఖ్య కోశాధికారి రేణుకా ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ఉత్పత్తిదారుల సంఘాల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి మహిళా రైతు కుటుంబం కూడా పెరటి తోటలు వేసి అందులో ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా ఆకుకూరలు, కాయగూరలతో పాటు మునగ, కరివేపాకు, బొప్పాయి ,జామ మొదలగు చెట్లను పెంచుకోవాలని సూచించారు. గ్రామాలలో మహిళలందరికీ అవగాహన కల్పించి ,అందరి ఆరోగ్యానికి అవసరమైన చిరుధాన్యాల ఉత్పత్తికి ప్రణాళికలు తయారు చేసుకొని రాగులు జొన్నలు, గంటిలు ,సామలు ,ఉలవలు మొదలగు విత్తనాలను సమకూర్చుకొని పండించాలని కోరారు . రైతు సంఘాలకు చిరుధాన్యాలు, తోట పంటల ఉత్పాదకతకు అవసరమైన పనిముట్లు, పెట్టుబడి సహాయానికి మండల రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య ఆధీనంలో బ్యాంకుల ద్వారా అవసరమైన రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు . ఈ కార్యక్రమంలో పద్మ, కుమారి, వి.వో.ఏ. రాజేశ్వరి పాల్గొన్నారు.










