Mar 25,2023 17:29

పొదుపు మహిళలకు చెక్కు అందజేస్తున్న జిల్లా కలెక్టర్‌, మార్క్ఫెడ్‌ చైర్మన్‌ మున్సిపల్‌ చైర్మన్‌

మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించాలి
- మూడో విడత వైఎస్‌ఆర్‌ ఆసరా నిధులు విడుదల
- 25,936 స్వయం సహాయక సంఘాలకు రూ.166.96 కోట్లు
- జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలాని సామూన్‌
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

      మహిళలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ కోరారు. వైఎస్సార్‌ ఆసరా మూడో విడత పథకం కింద జిల్లాలోని డిఆర్డిఎ, మెప్మా పరిధిలోని 25,936 స్వయం సహాయక సంఘాలకు రూ.166.96 కోట్లు జమ అయినట్లు పేర్కొన్నారు. శనివారం ఏలూరు జిల్లా దెందులూరు బహిరంగ సభ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్‌ ఆసరా పథకం 3వ విడత రుణమాఫీ కింద రూ.6,419.89 కోట్ల ఆర్థిక సహాయాన్ని 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో బటన్‌ నొక్కి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో లైవ్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలాని సామూన్‌, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ పిపి.నాగిరెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ మాబున్నిసా, రాష్ట్ర హస్తకళల డైరెక్టర్‌ సునీత అమృతరాజ్‌ తదితరులు వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 3044 స్వయం సహాయక పొదుపు సంఘాలకు రూ. 20.89 కోట్లు, బనగానపల్లిలో 4282 సంఘాలకు రూ.28.29 కోట్లు, డోన్‌లో 3029 సంఘాలకు రూ.17.81 కోట్లు, నందికొట్కూర్‌లో 4072 సంఘాలకు రూ.27.29 కోట్లు, నంద్యాలలో 2001 సంఘాలకు రూ.13.95 కోట్లు, పాణ్యంలో 1346 సంఘాలకు రూ.63.94 కోట్లు, శ్రీశైలంలో 3277 సంఘాలకు రూ.21.45 కోట్లు మొత్తం 21,001 సంఘాలకు చెందిన 2,09,692 మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లో 136.10 కోట్లు నేరుగా జమ చేశామన్నారు. మెప్మా పరిధిలో ఆళ్లగడ్డలో 705 సంఘాలకు రూ.4.93 కోట్లు, ఆత్మకూరులో 331 సంఘాలకు రూ.1.68 కోట్లు, డోన్‌లో 774 సంఘాలకు రూ.4.55 కోట్లు, నందికొట్కూరులో 706 సంఘాలకు రూ.4.39 కోట్లు, నంద్యాలలో 2419 సంఘాలకు రూ. 15.29 కోట్లు మొత్తం 4,935 సంఘాలకు చెందిన 43,059 మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.30.86 కోట్లు నేరుగా జమ చేశామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్‌, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌, మున్సిపల్‌ చైర్మన్‌, డిఆర్డిఏ పిడి, రాష్ట్ర హస్తకళల డైరెక్టర్‌ తదితరుల చేతుల మీదుగా స్వయం సహాయక సంఘాల మహిళలకు మెగా చెక్కును అందజేశారు.