మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి: కమిషనర్
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: నేటి సమాజంలో ప్రతి ఒక్క మహిళ ఆర్థిక స్వావలంబన సాధించాలని, ఈ దిశగా మెప్మా మహిళలకు మార్గదర్శిగా నిలవాలని నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ పిలుపునిచ్చారు. బుధవారం మిట్టూరులోని మెప్మా ప్రాజెక్ట్ కార్యాలయంలో నిర్వహించిన చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని భరతమాత పట్టణ మహిళా సమైఖ్య కార్యవర్గ సమావేశానికి కమిషనర్ అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహిళల్లో జీవనోపాదులను మెరుగుపరిచేలా కార్యక్రమాలను అమలు చేయాలన్నారు. మహిళ ఆర్థికంగా పురోభివద్ధి సాధిస్తే తద్వారా కుటుంబం, సమాజం ఆర్థికంగా బలపడతాయన్నారు. తీసుకున్న రుణాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, రుణాలను సమర్థవంతంగా తిరిగి చెల్లించడం ద్వారా కలిగే లాభాలను వివరించాలన్నారు. ఈసమావేశంలో భాగంగా క్షేత్రస్థాయిలో అమలవుతున్న కార్యక్రమాలపై ఆరా తీశారు. నగదు రహిత లావాదేవీలపై మహిళలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. 'గుప్పెడు బియ్యం' కార్యక్రమం గురించి తెలుసుకొని అభినందించారు. కార్యక్రమంలో సీఎంఎం గోపి, మెప్మా జిల్లా ఇన్చార్జ్ ఐబీ శ్రీరాములు, సీవోలు, సమైఖ్య అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.










