Mar 08,2023 21:13

జడ్జి అర్చనను సన్మానిస్తున్న జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ తదితరులు

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
- జాయింట్‌ కలెక్టర్‌ టి. నిశాంతి
- ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

      మహిళలందరూ పట్టుదలతో అన్ని రంగాలలో విజయాలు సాధించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.నిశాంతి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని వైఎస్సార్‌ సెంటనరీ హాల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. స్త్రీ తన జీవితం మొత్తం తనకోసం. తన చుట్టూ ఉన్న వారి కోసం నిరంతరం ఆలోచించే నిస్వార్థపరురారులని అన్నారు. స్త్రీలు ప్రేమకు, అభిమానానికి, త్యాగాలకు ఆదర్శనీయులన్నారు. భూమి నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాలలో స్త్రీలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. ప్రస్తుత సమాజంలో స్త్రీలు ఎన్నో విజయాలు సాధిస్తుస్తూ దేశ అధ్యక్షుల నుంచి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపీలు, ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు, జడ్జీలు, డాక్టర్స్‌, లాయర్స్‌, బ్యాంకర్స్‌, టీచర్స్‌, సైంటిస్టులు తదితర రంగాలలో ముందున్నారన్నారు. జిల్లా జడ్జి అర్చన మాట్లాడుతూ సమాజంలో పురుషులతో పాటు సమానంగా మహిళలు కూడా అన్ని రంగాలలో రాణిస్తున్నారన్నారు. అడిషనల్‌ ఎస్పీ రమణ మాట్లాడుతూ మహిళలపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఐసిడిఎస్‌ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ పద్మజ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలందరికీ సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరమన్నారు. అనంతరం ఆటల పోటీల విజేతలకు ప్రశంసా పత్రాలు, బహుమతులు ప్రదానం చేసారు. కార్యక్రమంలో గ్రీన్‌ కో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సిహెచ్‌ శ్రీనివాసరావు, ఐసిడిఎస్‌ పిడి లీలావతి, డీఈవో అనురాధ, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ సూపరింటెండెంట్‌ నాగమణి, మహిళలు, విద్యార్థినులు పాల్గొన్నారు. అలాగే ఎపిఎస్‌ఆర్‌టిసి బస్టాండ్‌ గ్యారేజ్‌లో జిల్లా ప్రజా రవాణా అధికారి టి. శ్రీనివాసులు, గడివేముల మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ శైలజ, నంద్యాల న్యూరాలజి డాక్టర్‌ ఏ.సునీత పాల్గొన్నారు. అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, దళిత సంఘాల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు.
మహిళలు ఆర్థిక స్వావలంభన దిశగా ఎదగాలి : శిల్పా మహిళా బ్యాంక్‌ చైర్‌ పర్సన్‌
మహిళలు ఆర్థిక స్వావలంభన దిశగా ఎదగాలని శిల్పా మహిళా బ్యాంక్‌ చైర్‌ పర్సన్‌ నాగిని రవి సింగారెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలోని భాష్యం పబ్లిక్‌ స్కూల్‌, చైతన్య కళాభారతి స్వచ్ఛంద సంస్థ, పరివర్తన లైఫ్‌ సెంటర్‌ సంస్థలలో జరిగిన పలు కార్యక్రమాల్లో శిల్పా మహిళా సహకార బ్యాంక్‌ చైర్‌ పర్సన్‌ పాల్గొని మహిళ దినోత్సవం విశిష్టత, మహిళల అభ్యున్నతి, మహిళా సాధికారత తదితర అంశాలపై వివరించారు.
నంద్యాల : విద్య, ఉద్యోగ, వ్యవసాయ, వాణిజ్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల ప్రగతి దేశాభ్యుదయానికి దోహదపడుతుందని విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్‌ రవీంద్రనాథ్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నంది రైతు సమాఖ్య ఆధ్వర్యంలో సాయిబాబా నగర్‌లోని శ్రీశైల పబ్లిక్‌ స్కూల్‌లో 'మహిళా వికాసం - సమాజ ప్రగతి' అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సుకు శిల్పా మహిళా బ్యాంక్‌ చైర్‌ పర్సన్‌ శిల్పా నాగిని రెడ్డి అధ్యక్షత వహించారు. శాస్త్రవేత్త వెంకట రమణమ్మ, న్యూరో ఫిజీషియన్‌ డాక్టర్‌ సునీత, శ్రీశైల పబ్లిక్‌ స్కూల్‌ హెచ్‌ఎం విజయ రాణి, కోటేశ్వర సుజాత, మాతృభాష పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్‌ దీవి హయగ్రీవాచారి తదితరులు పాల్గొని ప్రసంగించారు. కవులు నీలకంఠమాచారి, మహబూబ్‌ బాషా ,రఫీ శేష ఫణి మహిళా ఔన్నత్యంపై కవితలు వినిపించారు. ముఖ్య అతిధులను, మహిళా ప్రతినిధులను, చిరుధాన్యాలు పండించడంలో విశేష కృషి చేసిన మహిళా రైతు ఎస్‌. దేవిని, నంది రైతు సమాఖ్య నాయకులు కృష్ణారెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి, ఓబుళపతి తదితరులు ఘనంగా సత్కరించారు. శ్రీశైలపబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థుల సాంస్కతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి. సంజామల : మండలంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని అంగన్వాడీ టీచర్లు, పొదుపు సంఘాల మహిళలు ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ ఉపాధ్యాయులు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. నంద్యాల అర్బన్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ టిడిపి నంద్యాల ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సిరివెళ్ల : శిరివెళ్లలోని ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్‌ కె.దివ్య, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ రామ్మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళా సిబ్బందికి ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఆప్తాల్మిక్‌ ఆఫీసర్‌ కృష్ణమోహన్‌ రెడ్డి, పిహెచ్‌ఎన్‌ సరస్వతి, సూపర్వైజర్లు అమినాభి, లక్ష్మీదేవి, ఆరోగ్య సిబ్బంది, ఆశలు పాల్గొన్నారు. రుద్రవరం : స్థానిక వెలుగు కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళల హక్కులు-చట్టాలపై అవగాహన కార్యక్రమాన్నిప్యానల్‌ లాయర్‌ పి సుబ్బయ్య అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సీనియర్‌ న్యాయవాది శివప్రసాద్‌ రావు, రమణయ్య, తిరుపాల్‌ రెడ్డి, మహిళా న్యాయవాది గాజుల చందన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మహిళా సర్పంచులు కొల్లం లక్ష్మీదేవి, లక్ష్మీ నరసమ్మలను ఘనంగా సన్మానించారు. వెలుగు సిసి దేవానందం, పొదుపు మహిళలు పాల్గొన్నారు. పాణ్యం : మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఎపిఎం ప్రసాద్‌ ఆధ్వర్యంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు ఎన్‌.సరళమ్మ అధ్యక్షతన మహిళా దినోత్సవం నిర్వహించారు. గ్రామైక్య సంఘాల లీడర్లు, వివోఏలందరికీ నిర్వహించిన ఆటల పోటీలు, ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సిసిలు రఘురాం, పుల్లన్న తదితరులు పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : మాజీ ఎమ్మెల్యే బిసి దంపతులు
బనగానపల్లె : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి, ఆయన సతీమణి, థారు బాక్సింగ్‌ రాష్ట్ర చైర్మన్‌ బిసి ఇందిరా పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో బిసి ఇందిరా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బిసి ఇందిరాను మహిళలు ఘనంగా సన్మానించారు. మహిళలకు ఆటలు, పాటల పోటీలు నిర్వహించి విజేతలకు బిసి ఇందిరా బహుమతులను అందజేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి : ప్యానల్‌ న్యాయవాది
ఆళ్లగడ్డ : మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని ప్యానల్‌ న్యాయవాది షాహినా బేగం అన్నారు.. పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్బంగా జిల్లా జడ్జి వాసు ఉత్తర్వుల మేరకు చట్టాలపై అవగాహన సదస్సు కార్యక్రమం మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా షాహినా బేగం పోక్సో చట్టం, దిశా చట్టం, సిఆర్‌పిసి భరణం గురించి వివరించారు. కమిషనర్‌ రమేష్‌ బాబు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలన్నారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. ప్యానెల్‌ న్యాయవాది మోహన్‌, మెప్మా కార్యదర్శులు లక్ష్మి, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.